Site icon NTV Telugu

Toll Fee: వాహనదారులకు షాక్.. అమల్లోకి పెరిగిన టోల్ ఛార్జీలు

Toll Fee

Toll Fee

Toll Fee: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన అన్ని దశలు పూర్తయిన తర్వాత ఒక వైపు దేశం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. మరోవైపు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా టోల్ పన్నును పెంచింది. ఈరోజు నుంచి అన్ని టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు 5 శాతం అదనంగా టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఛార్జీల పెంపు నిర్ణయాన్ని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది. కాగా, కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఛార్జీ ల పెంపు అంశాన్ని ఈసీ వద్దకు తీసుకెళ్లింది. దీంతో ఈసీ ఎన్నికల నేపథ్యంలో పెంపు నిర్ణయం వాయిదా వేయాలని ఎన్‌హెచ్‌ఏఐను ఆదేశించింది. దీంతో కొత్త ఛార్జీల పెంపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఏడో విడత పోలింగ్ ముగియడంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. దీంతోనే ఎన్నికల కోడ్ ముగిసింది. తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ ఆదివారం అర్ధరాత్రి నుంచి కొత్త టోల్ ఛార్జీలు వసూలు చేస్తోంది.

Read Also: Japan Earthquake: జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

కొత్త రేట్లు జూన్ 3, 2024 నుండి వర్తిస్తాయని ఎన్‌హెచ్‌ఏఐ సీనియర్ అధికారి తెలిపారు. టోల్ ఫీజులను సవరించడం వార్షిక కసరత్తులో భాగమని, ఇది టోకు ధరల సూచిక ఆధారంగా ద్రవ్యోల్బణంలో మార్పులతో ముడిపడి ఉందని ఆయన అన్నారు. టోల్ రేట్లలో 3 నుండి 5 శాతం పెరుగుదల జూన్ 3, 2024 నుండి సోమవారం నుండి అమలులోకి వచ్చినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారి తెలిపారు. ఎన్నికల సమయంలో యూజర్ ఫీజు (టోల్) రేట్ల సవరణ వాయిదా వేశారని, అయితే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగిసినందున, ఈ రేట్లు జూన్ 3 నుండి అమల్లోకి వస్తాయని అధికారి తెలిపారు.

టోల్ ట్యాక్స్ అనేది కొన్ని ఇంటర్‌స్టేట్ ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ, రాష్ట్ర రహదారులను దాటేటప్పుడు డ్రైవర్లు చెల్లించాల్సిన రుసుము అని తెలిసిందే. ఇవి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పరిధిలోకి వస్తాయి. అయితే, ద్విచక్ర వాహన చోదకులకు టోల్ రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరుగుతాయని, ప్రయాణికులపై భారం పడుతుందని ఏటా టోల్ రేట్లను పెంచడాన్ని ప్రతిపక్షాలు, పలువురు వాహనదారులు వ్యతిరేకిస్తున్నారు.

Read Also: TG Polycet Results: నేడు పాలిసెట్ ఫ‌లితాల విడుద‌ల‌..

పెరిగిన టోల్ ఛార్జీలు జూన్ 3వ తేదీ (నేటి) నుంచి అమల్లోకి వచ్చాయి. పెంచిన ధరలు 2025 మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. నేషనల్ హైవేలపై కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5లు, ఇరు వైపులా కలిపి రూ.10లు, చిన్నపాటి కమర్షియల్ వాహనా లు ఒక వైపు ప్రయాణానికి రూ.10లు, ఇరువైపులా కలిపి రూ.20లు, బస్సులు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.25లు, ఇరువైపులా కలిపి రూ.35లు, పెద్ద ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ.35లు, ఇరువైపులా కలిపి రూ.50ల వరకు పెంచారు. నెలవారీ పాస్ రూ.330 నుంచి రూ. 340లకు పెరిగింది.

Exit mobile version