NTV Telugu Site icon

Rupee: షాకింగ్.. భారీగా పడిపోనున్న రూపాయి మారకం విలువ

Rupee Value

Rupee Value

Rupee: వచ్చే సంవత్సరం డాలర్ తో రూపాయి తీవ్ర ఒత్తిళ్లకు గురవుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ జీవిత కాల కనిష్ట పరిమితికి చేరుకుంది. అది మరికాస్త పడి పోయి ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే సంవత్సరం డాలర్ తో రూపాయి మారకం విలువ 85కు చేరుకోవచ్చంటున్నారు. ఇప్పటికే అక్టోబర్ 19 రూపాయి విలువ 83కు పడిపోయిన విషయం తెలిసిందే. ఆ స్థాయి నుంచి కోలుకుని ప్రస్తుతం 82 స్థాయిలో ట్రేడవుతోంది. ముంబైలో గురువారం ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ అండ్‌ ఎకనమిక్‌ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న పలువురు ఆర్థిక వేత్తలు స్పందిస్తూ.. జీడీపీలో 4 శాతానికి కరెంటు ఖాతా లోటు విస్తరించినందున ఇక ముందూ రూపాయిపై ఒత్తిడి కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. దీనికితోడు ఎగుమతులు సైతం అక్టోబర్ నెలలో క్షీణించడాన్ని ప్రస్తావించారు. వచ్చే ఏడాది డాలర్‌ మారకంలో రూపాయి గరిష్టంగా 83, కనిష్టంగా 85కు చేరుకోవచ్చని ఐసీఆర్‌ఐఈఆర్‌ సీఈవో దీపక్‌ మిశ్రా, జేపీ మోర్గాన్‌ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త సాజిద్‌ చినాయ్‌ పేర్కొన్నారు. రూపాయి 80–82 రేంజ్‌లో ఉండొచ్చని ఎస్‌బీఐ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్‌ అంచనా వేశారు. ఐజీఐడీఆర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రాజేశ్వరిసేన్‌ గుప్తా 84–85కు చేరుకోవచ్చన్నారు.