Site icon NTV Telugu

NewsClick Raids: న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ అరెస్ట్

Newsclick

Newsclick

NewsClick Raids: న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థను మంగళవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద నమోదు చేసిన కేసుకు సంబంధించి చైనా అనుకూల ప్రచారం కోసం డబ్బు అందుకున్నారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు. న్యూస్‌క్లిక్‌లో హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ అమిత్ చక్రవర్తి కూడా అరెస్టయ్యారు. అంతకుముందు రోజు విచారణ నిమిత్తం ప్రబీర్‌ పుర్కాయస్థను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. దీంతో పాటు న్యూక్లిక్ కార్యాలయానికి పోలీసులు సీల్ వేశారు.

Also Read: China: గూఢచారి నౌకలతో భారత్ సముద్ర ప్రాంతాన్ని చైనా ఎందుకు స్కాన్ చేస్తోంది?

ఉపా కేసుకు సంబంధించి న్యూస్‌క్లిక్ ఆన్‌లైన్ పోర్టల్‌కు సంబంధించిన పలువురు జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లపై ఢిల్లీ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పోలీసులు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లతో సహా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్క్‌ల డేటా డంప్‌లను తీసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) షేర్ చేసిన ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈ సోదాలు జరిగాయి. వారి విదేశీ ప్రయాణాలు, షాహీన్‌బాగ్‌లో పౌరసత్వ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు, రైతుల ఆందోళనతో సహా వివిధ సమస్యలపై పోలీసులు 25 ప్రశ్నల జాబితాను సంధించినట్లు పలు వర్గాలు తెలిపాయి.

Also Read: Earthquake: భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి?.. తీవ్రతను ఎలా కొలుస్తారు?

న్యూస్‌క్లిక్‌తో సంబంధం ఉన్న జర్నలిస్టులు, రచయితల ఇళ్లపై దాడులు జరగడం పట్ల ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆన్ ఎక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాము పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని, వివరణాత్మక ప్రకటనను విడుదల చేస్తామని ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఈ దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. బీహార్ కులగణన ద్వారా బయటపడిన సంచలన విషయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారని మండిపడింది. దేశవ్యాప్తంగా కులగణనకు డిమాండ్​ పెరుగుతోందని, దీన్ని కప్పిపుచ్చేందుకు దాడులు జరుపుతున్నారని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేడా పేర్కొన్నారు.

Exit mobile version