NTV Telugu Site icon

Moga Cyclone: ‘మాండూస్’ ముగిసింది.. ‘మోగా’ మోగిస్తది

Weather Report

Weather Report

Moga Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను ఆదివారం ఉదయం తీరం దాటింది. క్రమంగా అది బలహీనపడి… అరేబియా సముద్ర ప్రాంతానికి వెళ్లింది. దీని ప్రభావంతో గత రెండు రోజులుగా తమిళనాడు, ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటినప్పటికీ ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో వరుసగా నాలుగో రోజు సముద్రం ఉగ్రరూపం దాల్చుతోంది. మాండూస్ తుపాను ముగిసేంత లోపే మరో ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 16వ తేదీన బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Read Also: Mandous Cyclone : చెన్నైలో చెత్త.. రేయింబవళ్లు తిరుగుతున్న టిప్పర్లు

ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో ఈరోజు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. రేపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను కదలికను బట్టి ‘మోగా’ తుపానుకు సంబంధించిన అధికారిక సమాచారం చెప్పగలమని వాతావరణ కేంద్రం చెబుతోంది. అయితే ప్రస్తుత అంచనాల ప్రకారం తుపానుగా మారి శ్రీలంక తమిళనాడు సరిహద్దును దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి అని అంటున్నారు అధికారులు.