Site icon NTV Telugu

YS Jagan: అలా చేస్తేనే మంచి లీడర్‌గా ఎదుగుతారు.. యువతకు వైఎస్ జగన్ దిశానిర్దేశం!

Ys Jagan

Ys Jagan

రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏనాడూ రాజీ పడలేదు అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికష్టాలు వచ్చినా.. వైసీపీలో విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశామన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అని, పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండడం చాలా ముఖ్యం అని, సమస్య వచ్చినప్పుడు ప్రజలకు తోడుగా నిలబడాలని జగన్ సూచించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం ప్రతినిధులతో జగన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి, యూత్ వింగ్ సభ్యులు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. యువతకు తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై జగన్ దిశానిర్దేశం చేశారు.

‘ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు గొప్ప అవకాశం. పార్టీ ప్రారంభించిన కొత్తలో అందరూ కొత్తవాళ్లే. పార్టీ పెట్టిన కొత్తలో నేను, మా అమ్మ మాత్రమే ఉన్నాం. నామీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్నవాళ్లు నాతో వచ్చారు. నా ప్రస్థానం అక్కడ నుంచి మొదలయ్యింది. ఎన్నికష్టాలు వచ్చినా విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశాం. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదు. ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ నాకు వచ్చింది. పార్లమెంటులో ప్రతి సభ్యుడూ మనవైపు చూసే పరిస్థితి. దాన్ని జీర్ణించుకోలేక మనమీద పగబట్టారు. 18 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే.. వాళ్లందరి చేతా రాజీనామా చేయించాను. ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. ఆ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేశాయి. 2014లో 67 మందితో గెలిచాం. మళ్లీ మన దగ్గర నుంచి 23 మందిని లాక్కున్నారు’ అని వైఎస్ జగన్ తెలిపారు.

Also Read: Daggubati Purandeswari: స్వలాభాపేక్ష ఏ రోజూ చూసుకోలేదు.. నాకు మరో ఆలోచన లేదు!

‘ప్రజలకు అందుబాటులో ఉండడం అన్నది చాలా ముఖ్యం. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు తోడుగా నిలబడాలి. మంచి పలకరింపు అన్నది కూడా చాలా ముఖ్యం. ఇవి చేయగలిగితే లీడర్‌గా ఎదుగుతారు. యూత్‌ వింగ్‌లో ఉన్న వారు ప్రభావంతంగా పనిచేయాలి. రాజకీయంగా ఎదగడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని రాజకీయంగా పెంచడం నా చేతుల్లో ఉంది.పెరగాలంటే మీరు కష్టపడాలి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయండి. సమర్థత ఉన్న వారిని పార్టీ వ్యవస్థల్లోకి తీసుకురండి. పార్టీని వ్యవస్థీకృతంగా బలోపేతం చేయాలి. మీ పనితీరును మీరు ఎప్పటికప్పుడు మీరే మదింపు చేసుకోండి. జోన్ల వారీగా యూత్‌ వింగ్‌ వర్కింగ్‌ ప్రెశిడెంట్లను కూడా పెడుతున్నాం. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన యువకులు దీనికి ఉంటారు. ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియాలోకి రావాలి. వాస్తవాలను చెప్పడానికి ఇది ఒక ఆయుధం. అన్యాయాలను, అక్రమాలను ఈ మాధ్యమం ద్వారా వెలుగులోకి తీసుకు రావాలి. ప్రజలందరి దృష్టికి ఈ సమాచారాన్ని చేరవేయాలి. ఎవరికి ఏ అన్యాయం జరిగినా సమాజం దృష్టికి తీసుకు రావాలి’ అని మాజీ సీఎం జగన్ యువతకు చెప్పారు.

Exit mobile version