Parliament protests: శుక్రవారం (జులై 31) పార్లమెంట్ ప్రాంగణంలో చోటుచేసుకున్న ఓ విచిత్ర సంఘటన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. భవిష్యత్తులో ప్రజాప్రతినిధులు ఇటువంటి నాటకాలు ఆడకూడదని హెచ్చరించారు. పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ (రాజేష్ రంజన్) కాషాయ వస్త్రాలు ధరించి, సాధువు వేషంలో పార్లమెంట్ మకర్ ద్వారం వద్ద కూర్చున్నారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి ఆయన ముందున్న విరాళాల పెట్టెలో డబ్బులు వేశారు. వెంటనే ప్రతిపక్ష ఎంపీలు ‘చందా చోర్, గద్ది ఛోడ్’ (చందాల దొంగ, సీటు ఖాళీ చెయ్యి) అంటూ నినాదాలు చేశారు. గతంలో ఇంధన ధరల పెరుగుదలపై నిరసనగా ఎంపీలు ఎడ్లబండ్లు, సైకిళ్లపై పార్లమెంట్‌కు రావడం చూశాం. కానీ ఈ రకంగా సాధువు వేషంలో వచ్చి భిక్షాటన చేయడం, రాహుల్ గాంధీ అందులో డబ్బులు వేయడం పార్లమెంట్, ప్రజాప్రతినిధుల గౌరవానికే భంగం కలిగించేలా ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఎంపీల హక్కు అయినప్పటికీ, ఇటువంటి ప్రహసనాలు ఒక నిర్దిష్ట వర్గ విశ్వాసాలను అవమానించడమే కాక, పార్లమెంట్ మర్యాదలను దిగజార్చేలా ఉన్నాయి.
భారత పార్లమెంటరీ చరిత్రను గమనిస్తే, తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుంచే తీవ్ర నిరసనలు ఉండేవి. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, ఆచార్య జేబీ కృపలానీ, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, యువ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి దిగ్గజాలు నెహ్రూ విధానాలను పార్లమెంట్ లోపలే ఎండగట్టేవారు. 1962 చైనా యుద్ధం సమయంతో పాటు 1960లో చైనా ప్రధాని చౌ-ఎన్-లై రాక సందర్భంగా విపక్షాలు తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపాయి. అయితే ఆ నిరసనలన్నీ కూడా ఒక హుందాతనంతో, విధానపరమైన విభేదాలకే పరిమితమయ్యేవి. నెహ్రూ కూడా విపక్షాల విమర్శలను అంతే ఓపికగా వింటూ, సమాధానమిచ్చేవారు. అయితే ఇందిరా గాంధీ హయాంలో విపక్ష స్వరాన్ని అణచివేసే ధోరణి పెరిగింది. 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ బలం తగ్గడంతో ఆమె ‘గరీబీ హఠావో’ నినాదం, బ్యాంకు జాతీయకరణ వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రైవీ పర్సుల రద్దు, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం వంటి పరిణామాల ద్వారా విజయం సాధించినప్పటికీ, ఆర్థిక సమస్యలు, విద్యార్థి ఉద్యమాలు, జేపీ ఆందోళనల నేపథ్యంలో చివరకు అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారు.
ఆ నిర్ణయమే కాంగ్రెస్ పతనానికి పునాది వేసింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతకు అధికారిక గుర్తింపు లభించింది. తరువాత 1980లో ఇందిర మళ్లీ అధికారంలోకి వచ్చినా, పంజాబ్ ఉగ్రవాదం, సిక్కుల వ్యతిరేక అల్లర్లు, ఇందిర హత్య వంటి దారుణాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత రాజీవ్ గాంధీ భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ విపి సింగ్, అరుణ్ నెహ్రూల రూపంలో సొంత పార్టీ నుంచే నిరసనలు ఎదుర్కొన్నారు. 1991లో పి.వి. నరసింహారావు ఆర్థిక సంస్కరణలతో పాలన అందించిన కాలం తర్వాత నుంచి పార్లమెంట్‌లో నిరసనల స్థాయి క్రమంగా దిగజారడం ప్రారంభమైంది. దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్, వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ కాలంలో ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత విమర్శలు, క్యారెక్టర్ అస్సాసినేషన్లు ఎక్కువయ్యాయి. ఇక 2014 తర్వాత రాజకీయాలు కేవలం ఓటు బ్యాంకులు, విభజన రాజకీయాల చుట్టూ తిరుగుతూ, పార్లమెంట్ లోపల, వెలుపల ప్రజాస్వామ్య విలువలు క్షీణించేలా చేశాయి. శుక్రవారం పార్లమెంట్ ముందు జరిగిన ఈ ప్రహసనం, పార్లమెంటరీ వ్యవస్థలో రోజురోజుకూ క్షీణిస్తున్న ప్రమాణాలకు నిదర్శనంగా నిలిచింది.

