లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమికి క్లియర్ కట్ మెజార్టీ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తును స్టార్ట్ చేసింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో ఇవాళ ( బుధవారం) సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూటమి పార్టీల అధినేతలందరు ఈ సమావేశానికి రావాలని పిలుపునిచ్చారు. ఈసారి ఎన్డీయే కూటమికి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో పాటు ప్రభుత్వం స్థిరంగా కొనసాగాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. ముఖ్యంగా నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి కీలకపాత్ర పోషించబోతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ 16 స్థానాల్లో, జేడీయూ 14 స్థానాల్లో విజయం నమోదు చేశాయి.
Read Also: IND vs IRE: ప్రపంచకప్ వేటకు వేళాయె.. నేడు ఐర్లాండ్‌తో భారత్ ఢీ!
అలాగే, ఎన్డీయే కూటమిలోని ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన పార్టీకి ఆరు స్థానాలు, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జన శక్తి పార్టీకి 5 స్థానాల్లో గెలిచాయి. దాంతో ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు ఎన్‌డీఏ కూటమికి కీలకంగా మారాయి. అయితే, ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కూటమి సమావేశం గురించి చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే జేపీ నడ్డా నివాసంలో బీజేపీ సమావేశం మంగళవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.