NTV Telugu Site icon

Tirupati Deputy Mayor Election: తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఉత్కంఠకు తెర.. కూటమిదే విజయం..

Tirupati Deputy Mayor

Tirupati Deputy Mayor

Tirupati Deputy Mayor Election: తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడింది.. విజయం మీదా..? మాదా? అనే ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరకు తిరుపతి డిప్యూటీ మేయర్‌ పోస్టును తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ-భారతీయ జనతా పార్టీ కూటమి కైవసం చేసుకుంది.. నగర డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థినే గెలుపు వరించింది.. డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు కూటమి అభ్యర్థి ఆర్‌సీ మునికృష్ణా ‌.. కూటమి అభ్యర్ది ఆర్‌సీ మునికృష్ణాకు మద్దతుగా చేతులెత్తారు 26 మంది కార్పొరేటర్లు.. మరోవైపు.. ఎలాగైనా తిరిగి ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఓటమి చవిచూడాల్సి వచ్చింది.. వైసీపీ అభ్యర్థి లడ్డూ భాస్కర్ రెడ్డికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు.. దీంతో.. కూటమి అభ్యర్థి ఆర్‌సీ మునికృష్ణా విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు..

Read Also: Prithviraj Sukumaran: ప్రభాస్ గురించి అసలు నిజం బయటపెట్టిన పృథ్వీరాజ్ సుకుమారన్

కాగా, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కిడ్నాప్‌నకు గురయ్యారనే పుకార్లు షికారు చేశాయి.. అయితే, కిడ్నాప్‌ వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ.. క్లారిటీ ఇచ్చారు.. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు అంటూ ఓ వీడియో విడుదల చేశారు.. అనారోగ్యంగా కారణంగా.. ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు.. ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను.. వైద్యులు డిశ్చార్జ్‌ చేయగానే వస్తాను.. అయితే, నా ఆరోగ్యం గురించి గానీ, నేను కిడ్నాప్‌నకు గురయ్యాననే వార్తలపై గానీ, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని.. ప్రజలు, అధికారులు, మీడియాకు విడుదల చేసిన ఆ వీడియోలో పేర్కొన్నారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం..అయితే, షెడ్యూల్‌ ప్రకారం నిన్నే ఎన్నిక జరగాల్సిన ఉన్నా.. ఇవాళ్టికి వాయిదా పడింది.. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అదృశ్యమయ్యారని.. గత అర్థరాత్రి నుంచి అతను కనిపించకుండా పోయారని, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉందని అతని అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం.. డిప్యూటీ మేయర్ పదవిని చేజిక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 25గా ఉంది.. నిన్నటి రోజున ఎన్నికల కేంద్రానికి వస్తున్న వైసీపీ కార్పొరేటర్లలో నలుగురు అదృశ్యం… టీడీపీ నేతలు.. నలుగురు వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారనే ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించాయి.. అయితే, తాము క్షేమంగానే ఉన్నామని, గొడవలు చూసి భయపడి వచ్చేశామని సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు నలుగురు వైసీపీ కార్పొరేటర్లు.. మరోవైపు, తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ నిన్న మధ్యాహ్నం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. అదృశ్యమైన నలుగురు కార్పొరేటర్ లను భారీ భద్రత నడుమ ఎన్నికల కేంద్రానికి తీసుకురావాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు.. అయితే, మొత్తంగా డిప్యూటీ మేయర్‌ ఎన్నికతో తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఉత్కంఠకు తెరపడింది..