Site icon NTV Telugu

Naveen Nischal: సస్పెన్షన్ కానుకగా ఇచ్చినా.. బ్రతికున్నంత వరకు వైసీపీలోనే!

Naveen Nischal Ycp

Naveen Nischal Ycp

పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తే.. సస్పెన్షన్ కానుకగా ఇచ్చారని వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఏపీ ఆగ్రోస్ మాజీ చైర్మన్ నవీన్ నిచ్చల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉరి తీసేటప్పుడు కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, వైసీపీ అధిష్టానం తనను ఏమీ అడగలేదని మండిపడ్డారు. 15 ఏళ్లు నందమూరి బాలకృష్ణతో పోరాడి పార్టీ కోసం పని చేశానని.. తనని కాదని ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చినా పార్టీ కోసం పని చేశానన్నారు. తన సస్పెన్షన్ వెనుక కొందరు పెద్దలు ఉన్నారని.. ఈరోజు కాకపోయినా ఏదో ఓరోజు పార్టీ నిజానిజాలు తెలుకుంటుందన్నారు. తనకు వైఎస్ఆర్ అంటే ఇష్టమని.. ఆ తర్వాత వైఎస్ జగన్ అంటే ఇష్టమని తెలిపారు. తాము మరొక పార్టీలోకి వెళ్లేది లేదని.. బ్రతికున్నంత వరకు వైసీపీ కార్యకర్తలకు, తన మనుషులకు అండగా ఉంటా అని నవీన్ నిచ్చల్ స్పష్టం చేశారు.

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్‌ని వైసీపీ అధిష్టానం బుధవారం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులతో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ వేటు వేసింది. సస్పెండ్ అనంతరం నవీన్ నిచ్చల్ మీడియాతో ఈరోజు మాట్లాడారు. ’15 ఏళ్లు బాలకృష్ణతో పోరాడి పార్టీ కోసం పని చేశాను. నన్ను కాదని ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చినా పార్టీ కోసం పని చేశాను. నేను పని చేయలేదని ఇక్బాల్, దీపికలను ప్రమాణం చేయమనండి. నేను చిత్తశుద్ధితో పని చేస్తే సస్పెన్షన్ కానుకగా ఇచ్చారు. నేను పోటీ చేసినప్పుడు 7వేలు మాత్రమే తేడా ఉంది. ఇక్బాల్ 20వేలు, దీపిక 30వేల తేడాతో ఓడిపోయారు. 2019లో నాకు టికెట్ ఇచ్చి ఉంటే వెయ్యి శాతం వైసీపీ గెలిచేది. డే వన్ నుంచి ఒక కుట్రతోనే నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. కొందరు పెద్దలు నా సస్పెన్షన్ వెనుక ఉన్నారు.. పేర్లు చెప్పను. ఈరోజు కాకపోయినా పార్టీ నిజానిజాలు తెలుకుంటుంది’ అని నవీన్ నిచ్చల్ అన్నారు.

Also Read: MLA Kotamreddy: ప్రేమిస్తే పోయేదేమి లేదు డ్యూడ్.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు! ఎమ్మెల్యే ట్వీట్ వైరల్

‘కార్యకర్తకు కష్టం వస్తే నిలబడే నాయకుడు నేను మాత్రమే. నన్ను సాకుగా చూపి.. వారు లబ్ధి పొందుతున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఇప్పుడు వెయ్యి శాతం విఫలమవుతారు. పార్టీ నన్ను సస్పెండ్ చేసినా నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. 2009లో నన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.. 2014లో పోటీ చేశాను. నేను వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ ఎంత బలంగా ఉందో తెలుకోండి. వైఎస్ జగన్ నాకు 2 సార్లు టికెట్ ఇవ్వకపోయినా.. నేను ఆయన కోసం పని చేశాను. నాకు వైఎస్ఆర్ అంటే ఇష్టం.. ఆ తర్వాత జగన్ అంటే ఇష్టం. నేను మరొక పార్టీలోకి వెళ్లేది లేదు. నేను బ్రతికున్నంత వరకు వైసీపీ కార్యకర్తలకు, నా మనుషులకు అండగా ఉంటా. నా వాళ్లకు నేను తోడుంటా.. ప్రత్యర్థులను ఎదుర్కొంటా. హిందూపురం వైసీపీని నాశనం చేయాలనుకుంటున్నారు. ఆ ఉచ్చులో వైసీపీ అధిష్టానం పడవద్దని కోరుకుంటున్నాను’ అని నవీన్ నిచ్చల్ సూచించారు.

Exit mobile version