Site icon NTV Telugu

Jairam Ramesh: ఫరూఖ్ అబ్దుల్లా నిర్ణయంపై జైరాం రమేష్ ఏమన్నారంటే..!

Nc Ramesh

Nc Ramesh

సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమికి (India Bloc) దెబ్బ మీద దెబ్బలు తగలుతున్నాయి. ఇప్పటికే కూటమిలోని పార్టీలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా సొంత నిర్ణయాలతో ముందుకు పోతున్నాయి. ఇక బీహార్‌లో అయితే ఇండియా కూటమి నుంచి జేడీయూ అధినేత నితీష్‌కుమార్ బయటకు వెళ్లిపోయి ఎన్డీఏతో జత కట్టారు. మరికొన్ని పార్టీలు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించేశాయి. ఇప్పుడు ఈ కోవలోకి మరో పార్టీ వచ్చి చేరింది.

ఇండియా కూటమిలో కీలక మద్దతుదారుగా ఉన్న జమ్మూ కాశ్మీర్ నేత ఫరూఖ్ అబ్దుల్లాకి (Farooq Abdullah) చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (National Conference) కూడా ఒంటరి పోరుకు సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా.. మంచి విజయాన్ని సాధిస్తామని ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు.

ఇకపోతే గత నెలలో ఫరూఖ్ అబ్దుల్లా సీట్ల షేరింగ్‌పై ఏకాభిప్రాయం కుదరకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మనం దేశాన్ని రక్షించాలంటే.. విభేదాలను ప్రక్కన పెట్టి దేశం గురించి ఆలోచించాలన్నారు. కానీ ఇంతలోనే ఆయన షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

జైరాం రమేష్…
ఎన్‌సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) స్పందించారు. అబ్దుల్లాతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్షానికి వారి స్వంత పరిమితులు ఉంటాయని పేర్కొన్నారు. ఇండియా కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా ఒక భాగమని గుర్తుచేశారు. కలిసి చర్చించుకుని ముందుకు సాగుతామని జైరాం రమేష్ స్పష్టం చేశారు.

మోడీ సర్కార్‌ను (PM Modi) ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. కానీ సార్వత్రిక ఎన్నికల ముందు మాత్రం ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. ఓట్లు చీలకూడదన్న భావనతో కూటమి ఏర్పాటు చేశారు గానీ.. ఆ దిశగా మాత్రం కూటమి శైలి ఉండడం లేదు. మరీ ఎన్నికల సమయానికైనా సర్దుకుంటుందా? లేదంటే ఇలానే ముందుకు సాగుతుందో వేచి చూడాలి.

 

Exit mobile version