NTV Telugu Site icon

Narendra Modi : నేను చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా.. మానసికంగా రాముడికే అంకితమయ్యాను

Narendra Modi

Narendra Modi

తెలుగు మీడియా చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయోధ్య రామమందిరం 5వందల ఏళ్ల కల, ఆ రోజున మీ భావోద్వేగం ఎలా ఉంది..? అనే ప్రశ్నకు ప్రధాని మోడీ స్పందిస్తూ.. ‘మీరు నా భావోద్వేగానికి సంబంధించిన ప్రశ్న అడిగారు. ఓ రోజు ట్రస్టీలు నా దగ్గరకు వచ్చారు. అంతటి మహత్కార్యానికి సాక్షీభూతంగా నిలవడాన్ని నేను చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. నేను నా పరిచయస్తులతో దీనిపై చర్చించాను. ఇది 5వందల ఏళ్ల కల ఇందులో చాలామందికి భాగస్వామ్యం ఉంది. ఇది నా మీద గురుతర బాధ్యతగా భావించాను. నేనొక ప్రధానిగా, రాజకీయ నేతగా ఈ బాధ్యత తీసుకోలేదు. ఓ సామాన్య భక్తుడిగా ఈ దేశ సంస్కృతికి అంకితం అవుతూ ఈ బాధ్యత తీసుకున్నా. మానసికంగా మిగితా అన్ని విషయాలు పక్కన పెట్టేశా.. మానసికంగా రాముడికే అంకితమయ్యాను. అనుష్టానానికి సంబంధించి కొందరు పెద్దలు కొన్ని సలహాలు ఇచ్చారు.

నేను అంతకుమించి చేశాను. ప్రాణపత్రిష్ట సందర్భంగా నేను 11 రోజుల నిష్టతో ఉన్నాను. దక్షిణాదిలోనూ అనేక ఆలయాలు సందర్శించాను. రాముని భక్తిలో పూర్తిగా మమేకమయ్యాను. ప్రాణప్రతిష్ఠ రోజు అయోధ్యలో అడుగుపెట్టినప్పటి నుంచి క్షణక్షణం అలౌకిక భావానికి గురయ్యాను. సరిగ్గా రాముడి ముందు నిలబడి చూస్తుంటే ఆ కళ్లలో మెరుపు, మచ్చలేని ముఖం, చిన్న చిరునవ్వు.. 5వందల ఏళ్ల కల నిజంగా నా కళ్లముందు ప్రత్యక్షమైనట్లు కనిపించింది. ఆ పరిస్థితిని వర్ణించడానికి నా దగ్గర పదాలు లేవు. ఆ కళ్లలో సజీవ వ్యక్తిత్వం కదలాడింది. ఆ కళ్లు నాకేదో సందేశం ఇస్తున్నట్లు అనిపించింది. రాముడికి నాకు మధ్య అడ్డుతెరలు లేని ఏదో బంధం ఏర్పడింది. అప్పుడు నాకు ఏం అనిపించిందో ఎప్పటికీ స్పష్టంగా చెప్పలేను.

నేను మొన్న కూడా మరోసారి వెళ్లాను. కొన్ని కారణాల వల్ల గర్భగుడిలోకి వెళ్లలేకపోయాను. బయటి నుంచే పూజాదికాలు ముగించాను. ఈ సారి కూడా మొదటిసారి కలిగిన అనుభూతే మళ్లీ కలిగింది. అది ఓ రోజు, ఇది ఇంకో రోజు అన్న విషయమే గుర్తు రాలేదు. భక్తి భావంలో నాకు కోరికలేవి ఉండవు. నా మనసు నిండా140 కోట్ల దేశప్రజలే ఉంటారు. వారి సంక్షేమమే కోరుకుంటాను. అక్కడ ట్రస్టీలు నాతో ఓ విషయం చెప్పారు. ఇక్కడకు అనేక మంది భక్తులు వస్తారు. వాళ్లను ఆ స్థంభం నుంచి విడపించడమే కష్టమవుతుందట. అక్కడ వాలంటీర్లకు కూడా భక్తుల భావావేశాన్ని అదుపుచేయడం కష్టమవుతుంది.