రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ విద్యార్ధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ‘హాలో లోకేష్’ కార్యక్రమంలో విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. మహిళలను అవమానపర్చిన, కించపర్చిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తేవాలని లోకేష్ అభిప్రాయపడ్డారు. సినిమాలు, సీరియల్స్, సోషల్ మీడియాలో ఇటువంటి వాటిని నిషేధించాలని సూచించారు. ఆడింగోడివా, చేతికి గాజులు వేసుకున్నావా, చీర కట్టుకో వంటి మాటలను ఇళ్ల దగ్గర మాట్లాడటం మానేయండని విజ్ఞప్తి చేశారు. లోకేష్ అన్నయ్య చెప్పాడని చెప్పండని ఆన్నారు. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఇందుకోసం తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు.
రాజకీయాల్లో నన్ను ఎంతో మంది ట్రోల్ చేశారు. నేను ఛాలెంజ్ గా తీసుకుని జయించా. ఒక పూట మాత్రమే భోజనం చేస్తున్నా.. డాక్టర్ సలహా మేరకే డైట్ పాటిస్తున్నా. నేను చేసేనని మీరు ఎవరు చేయవద్దు. అమ్మకు చెప్పాలేని పని ఏమి మనం చేయకూడదు. అమ్మను గౌరవించాలి, అమ్మను బాగా చూసుకోవాలి’ అని విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజమండ్రిలో నారా లోకేష్ పర్యటన ఉత్సాహంగా సాగింది. లోకేష్ కు అడుగడుగునా టీడీపీ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ముందుగా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రవేశ ద్వారాన్ని లోకేష్ ప్రారంభించారు. ఆర్ట్స్ కళాశాల స్థాపించి 173 సంవత్సరాలు అయిన సందర్భంగా నిర్మాణం చేపట్టిన నూతన భవనాలను నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటిలోనూ ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని లక్ష్యంతో పనిచేశామని అన్నారు. ప్రతి కుటుంబం ఏఐలో ఉండేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
అనంతరం నన్నయ యూనివర్సిటీలో జరిగిన పలు కార్యక్రమాల్లో నారా లోకేష్ పాల్గొన్నారు. పలు నూతన భవనాలకు లోకేష్ ప్రారంభోత్సవాలు చేశారు. తర్వాత రాజమండ్రిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘టీడీపీని భూస్థాపితం చేస్తామని కొందరు అన్నారు. వారే భూస్థాపితం అయిపోతున్నారు. అన్న ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ మరో వందేళ్లు ఉంటుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలి పెట్టము. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు. టీడీపీలో ఒక జబ్బు ఉంది, అదే అలక. ఎమ్మెల్యేపై అలగడం కంటే ఆయనపై పోరాడండి. నాలుగు గోడల మధ్య ఆయన చేస్తున్న తప్పులను చెప్పి సరి చేయండి. మంగళగిరి, రాజమండ్రి నియోజకవర్గాలు టీడీపీ అడ్డాలు. రెండు నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించడం వైసీపీ తరం కాదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుని, ఆయన తండ్రి అప్పారావును వైసీపీ ప్రభుత్వంలో జైల్లో పెట్టి వేధించారు. ఎమ్మెల్యే భవానికి కూడా అసెంబ్లీ సాక్షిగా ట్రోల్ చేశారు. నా తల్లిని అవమానించడం.. ఇలా అన్నీ గుర్తున్నాయి. చంద్రబాబును అన్యాయంగా 53 రోజులు జైల్లో పెట్టారు. ఆ సమయంలో రాజమండ్రి టీడీపీ కార్యకర్తలు మాకు అండగా నిలిచారు. టీడీపీ కార్యకర్తల త్యాగాల వల్లే టీడీపీకి 164 సీట్లు వచ్చాయి’ అని నారా లోకేష్ అన్నారు. చివర్బగా ‘జై చంద్రబాబు, జై పవన్, జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ కార్యకర్తలతో నినాదాలు చేయించారు.
