NTV Telugu Site icon

Nara Bhuvaneshwari: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న నారా భువనేశ్వరి.. చంద్రబాబు కోసం పూజలు

Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును నంద్యాలలో అరెస్ట్‌ చేసిన సీఐడీ.. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తోంది.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగుతున్నాయి.. ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌లు, అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి.. ఇక, ఇంద్రకీలాద్రి చేరుకున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్నారు.. చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలని దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. భువనేశ్వరితో పాటు, నందమూరి రామకృష్ణ, కేశినేని చిన్ని, జలీల్ ఖాన్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. మనసు బాగోలేనప్పుడు తలిదండ్రుల దగ్గరకి వెళ్తాం.. నాకు తల్లి దుర్గమ్మ గుర్తొచ్చిందన్నారు. చంద్రబాబును క్షేమంగా తీసుకురావాలని దుర్గమ్మను కోరాను అన్నారు. చంద్రబాబు ప్రజలకోసం చాలా సేవ చేశారు.. చంద్రబాబు పోరాటం ప్రజల స్వేచ్ఛ కోసమే అన్నారు. చేయి చేయి కలిపి ప్రజలంతా ఏకమవ్వాలి.. మీరందరూ పోరాటం చేయాలి అది మీ హక్కు అని పిలుపునిచ్చారు. ఇక, మా ఆయన చంద్రబాబును రక్షించమని అమ్మవారిని వేడుకున్నట్టు వెల్లడించారు నారా భువనేశ్వరి..

ఇక, నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలందరి ఆశీస్సులు మా కుటుంబంపై ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అంటూ ప్రభుత్వంపై మండిపడ్డ ఆయన.. రాత్రికి రాత్రి ఎప్పటిదో కేసుతో అరెస్టు చేయడం దారుణం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మొదటి స్ధానంలో ఉంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రజలందరూ ఆయన క్షేమంగా రావాలని కోరుకోవాలి సూచించారు నందమూరి రామకృష్ణ.