Nara Bhuvaneshwari: నందమూరి కుటుంబంలో పుట్టడం నా అదృష్టం.. నాన్న ఎన్టీఆర్ మమ్మల్ని క్రమశిక్షణతో పెంచారని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. చంద్రగిరి నియోజకవర్గం, అగరాలలో ‘ నిజం గెలవాలి ‘ బహిరంగ సభలో మాట్లాడిన ఆమె.. ఇది వరకు గ్రామంలో కుటుంబంతో సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చి నా గుండె పిండేసిందన్నారు. మొదటిసారి ఇలా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నాను.. నిజం గెలవాలి.. అనే ఈ పోరాటం నా ఒక్కరిది కాదు.. మన అందరిది అన్నారు. మన బిడ్డలు, మన భావితరాల కోసం ఈ పోరాటం.. అసలు ఇక్కడ పరిపాలన ఉందా..? అని ప్రశ్నించారు. చంపడం, కేసులు, రేప్ లు, గంజాయి, భయపెట్టడం.. ఇవే రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. అభివృద్ధి ఎక్కడ..? అని నిలదీశారు. రాష్ట్రంలో అరాచకం జరుగుతోంది.. బ్రిటీష్ వారితో పోరాడినట్లుగా ఉంది.. తెలుగు వారి పౌరుషం చూపాలి అంటూ పిలుపునిచ్చారు.
చంద్రబాబును కాదు.. రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు భువనేశ్వరి.. నందమూరి కుటుంబంలో పుట్టడం నా అదృష్టం.. నాన్న ఎన్టీఆర్ మమల్ని క్రమశిక్షణతో పెంచారు.. ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు మూడు వేల మంది అనాథ పిల్లలకు చదువు చెప్పించాం.. అనేక అపద సమయాల్లో పేదలను ఆదుకున్నాం అని గుర్తుచేశారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ప్రజల కోసమే ఆలోచించారు. హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఆయనను చూసి నవ్వారన్నారు. చంద్రబాబు తప్పులను మొదట నేనే ఎత్తి చూపే దాన్ని.. కానీ, ఆయన ఒక విజన్ తో ఆలోచించేవారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా జైలులో ఆయన్ను నిర్బంధించారంటూ భావోద్వేగానికి గురయ్యారు. స్కిల్ స్కాం లో ఎలాంటి ఆధారాలు లేవు.. అనేక కొత్త కేసులు పెడుతున్నారు. ఎందులోనూ ఆధారాలు లేవన్నారు.
రాష్ట్ర విభజన సమయంలోనూ చంద్రబాబు ఎంతో ఆవేదన చెందారని గుర్తుచేసుకున్నారు భువనేశ్వరి.. కానీ, ఆయనపై అన్యాయంగా కేసులు పెడుతున్నారు. మొన్న చిత్తూరు జిల్లాలోనూ చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టారు.. పుంగనూరులో సైకిల్ యాత్ర చేస్తున్న వారిపై అత్యంత దౌర్జన్యంగా వ్యవహరించారు.. మీరు ఎంత బాధ పెట్టినా మా వాళ్లు తగ్గరు అని హెచ్చరించారు. లోకేష్ ను సైతం యువగళం యాత్రలో ఇబ్బంది పెట్టారు.. మాట్లాడే మైక్, చివరకు స్టూల్ కూడా లాక్కెల్లిపోయారని మండిపడ్డారు. ఇవాళ కాకపోయినా రేపు అయినా ఆయన జైలు నుంచి వస్తారు.. మానసికంగా ఇబ్బంది పెడితే దెబ్బ తీయవచ్చని అనుకుంటున్నారు. ఆయన చాలా స్ట్రాంగ్ అని వాళ్ళకి తెలియదన్నారు. ధైర్యంగా ముందుకు వచ్చి ఆయన ఇంకా కష్టపడతారు.. చేయి చేయి కలిపి మనం పోరాడాలి అంటూ పిలుపునిచ్చారు నారా భువనేశ్వరి.