CPI Leaders Kidnap Attempt: స్థానిక సంస్థల ఎన్నికల వేళ నంద్యాలలో సీపీఐ నేతల కిడ్నాప్ కలకలం రేపింది. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు, రుద్రవరం సీపీఐ జెడ్పీటీసీ అభ్యర్థి భాస్కర్‌ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఒక కానిస్టేబుల్‌తో కలిసి రుద్రవరం టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి రాజారావు ఈ ప్రయత్నానికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన సీపీఐ నాయకులు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దాంతో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి, సదరు కానిస్టేబుల్ అక్కడి నుంచి పరారయ్యారు.
సీపీఐ నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో రుద్రవరం టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి రాజారావు, కానిస్టేబుల్ ఓబులేశును వెంటబెట్టుకుని నంద్యాలలోని సీపీఐ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఉన్న రుద్రవరం సీపీఐ జెడ్పీటీసీ అభ్యర్థి భాస్కర్‌ను బయటకు రావాలని పిలిచారు. ఎస్‌ఐ పిలుస్తున్నారని చెప్పి.. భాస్కర్‌ను కార్యాలయం బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కిడ్నాప్ చేసేందుకు యత్నించారు.
ఈ ఘటనలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడును కూడా బెదిరించేందుకు రాజారావు, కానిస్టేబుల్ ప్రయత్నించారు. సీపీఐ నేతలపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నించగా.. రంగనాయుడు, పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం సీపీఐ నాయకులు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి రావడంతో రాజారావు కిడ్నాప్ యత్నం ఫలించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

