Nana Patekar Death: భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ (75) గురువారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గోవాలోని తన నివాసంలో ఆయన అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాపాడేందుకు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. పరిందా, క్రాంతివీర్, వెల్‌కమ్ వంటి హిందీ, మరాఠీ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటనలో జీవించిన ఆయన హఠాన్మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
అయితే తెరపై అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించిన నానా పటేకర్(Nana Patekar) జీవితంలో చాలామందికి తెలియని మరో సాహసోపేతమైన కోణం ఉంది. నటన విషయంలో నానాకు సాటి లేరు. ఆయన నటిస్తారనడం కన్నా జీవిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించిన నానా పటేకర్.. 1999 కార్గిల్ యుద్ధంలో (Kargil War) పాల్గొన్నారన్న సంగతి చాలా మందికి తెలియదు. 60 రోజుల పాటు యుద్ధంలో పాల్గొన్నట్లు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నానా పటేకర్ పంచుకున్నారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో దేశానికి తనవంతు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏకంగా ఆర్మీలో చేరి భద్రతా బలగాలతో కలిసి పనిచేశారు. సాధారణ పౌరులు సైన్యంలో చేరడం సులభం కాకపోవడంతో అప్పటి రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను కలిసి, తనకు ఉన్న కమాండో కోర్సు అనుభవాన్ని, ఆయుధాలు ఉపయోగించడంలో సాధించిన ప్రవేశాన్ని, జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన విషయాన్ని వివరించి ఆయనను ఒప్పించారు.
అలా అనుమతి పొందిన తర్వాత ద్రాస్, లెహ్, కుప్వారా, బారాముల్లా, సొపోర్ వంటి సున్నిత ప్రాంతాల్లో ఆర్మీతో కలిసి దాదాపు 60 రోజుల పాటు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ట్రూప్స్‌తో కలిసి తాను చేసిన పనుల వివరాలను గోప్యంగా ఉంచిన ఆయన, ఆ తర్వాత క్విక్ రియాక్షన్ టీమ్‌లో సభ్యుడిగా కూడా సేవలందించారు. యుద్ధ రంగంలో పనిచేస్తున్నప్పుడు సమయమే తెలియలేదని చెప్పిన నానా పటేకర్, ఆ తీవ్రమైన పరిస్థితుల వల్ల 76 కేజీల బరువుతో వెళ్లి తిరిగి వచ్చేసరికి 56 కేజీలకు తగ్గిపోయారు. నటుడిగానే కాకుండా దేశసేవలోనూ తన నిజమైన దేశభక్తిని చాటుకున్న ఆయన మరణం చలనచిత్ర రంగానికి, అభిమానులకు తీరని లోటు.

