Maharashtra: మహారాష్ట్రలోని నాగపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 17 ఏళ్ల యువ క్రికెటర్ అదితి చౌఖాండే అత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలంలో పోలీసులు ఒక సుసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం, అదితి చౌఖాండే స్వస్థలం మహారాష్ట్రలోని అకోలా. గత రెండేళ్లుగా నాగపూర్‌లోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో ఉన్న ఉమాలక్ష్మి అపార్ట్‌మెంట్‌లో తన తల్లితో కలిసి నివసిస్తోంది. అక్కడ సుర్వే క్రికెట్ అకాడమీలో క్రమం తప్పకుండా శిక్షణ పొందుతూ, క్రికెట్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కనేది. అయితే, ఇటీవల విదర్భ క్రికెట్ అసోసియేషన్ (VCA) నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో (సెలెక్షన్) ఆమెకు చోటు దక్కలేదు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది.
నాగపూర్‌లోని బజాజ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బుధవారం రాత్రి అదితి తన తల్లితో కలిసి భోజనం చేసిన తర్వాత తన గదిలోకి వెళ్లింది. గురువారం ఉదయం చూసేసరికి గదిలో ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న బజాజ్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. అక్కడ లభించిన సుసైడ్ నోట్‌లో “నాకు సిలెక్షన్ అవ్వలేదు” అని రాసి ఉంది. అదితి కుటుంబానికి క్రికెట్‌తో మంచి అనుబంధం ఉంది. ఆమె తండ్రి అకోలాలో సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండగా, అదితి తన తల్లి, అన్నయ్య ప్రబల్ చౌఖాండేతో కలిసి నాగపూర్‌లో ఉండేది. సంఘటన జరిగిన సమయంలో అన్నయ్య ఊరిలో లేరు. ప్రబల్ కూడా ఉదయించే క్రికెటర్‌గా రాణిస్తున్నారు. అదితి తన ప్రతిభతో పెద్ద స్థాయికి చేరుకుంటుందని కుటుంబ సభ్యులు భావించారు. బజాజ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చేతన్ చౌహాన్ మాట్లాడుతూ.. క్రికెట్ జట్టుకు ఎంపిక కాకపోవడమే ఈ నిర్ణయానికి ప్రాథమిక కారణమని తెలుస్తోందన్నారు.

