Site icon NTV Telugu

Hara Hara Mahadev: నాగార్జున ఆవిష్కరించిన మూవీ పోస్టర్!

Harahara Mahadev

Harahara Mahadev

Hara Hara Mahadev: జీ స్టూడియోస్ తెరకెక్కిస్తున్న ‘హర హర మహాదేవ్’ ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో సుబోధ్ భావే, బాజీ ప్రభు దేశ్‌పాండే పాత్రలో శరద్ కేల్కర్ నటించిన ఈ ‘హర హర మహాదేవ్’ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరాఠిలో తెరకెక్కించిన ఈ చిత్రం మొదటిసారిగా దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో, ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు పోస్టర్‌ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, “జీ స్టూడియోస్, శ్రీ గణేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ పోస్టర్‌ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నా చిన్నతనం నుంచీ ఛత్రపతి శివాజీ మహరాజ్ గురించి ఎన్నెన్నో వింటూనే ఉన్నాను. ఆయన ఎంత గొప్ప రాజు.. ఎలా పరిపాలించాడు.. అనేవి వింటూనే పెరిగాను. ఈ కథను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన కథనే కాకుండా, శివాజీ మహరాజ్ స్నేహితుడైన బాజీ ప్రభు దేశ్‌పాండే కథను కూడా చూపించబోతున్నారు. లక్షాయాభై వేల సైన్యాన్ని కేవలం 300 యోధులతో ఎలా ఎదుర్కొన్నారో ఇందులో చూపించబోతున్నారు. నేను ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు సినిమాల పరంగా భారతదేశం అంతా ఒక్కటే అయింది. చాలా చిన్నగా అనిపిస్తోంది. భాషాబేధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే.. అన్ని భాషల ప్రేక్షకులు సినిమాలను విజయవంతం చేస్తున్నారు” అని అన్నారు. ‘హర హర మహాదేవ్’ చిత్రానికి అభిజిత్ దేశ్‌పాండే దర్శకత్వం వహించారు. సుబోధ్ భావే, శరద్ కేల్కర్, అమృతా కాన్విల్కర్, సయాలీ సంజీవ్ ముఖ్య పాత్రల్లో నటించారు.

Exit mobile version