Naatu Naatu Song: అసాధ్యం సుసాధ్యమయింది. తెలుగు సినిమాలకూ ఆస్కార్ వస్తుందా? అంటూ వెటకారం చేసిన స్వదేశీయులకే విదేశీయులు సైతం మెచ్చేలా సమాధానం ఇచ్చిన ఘనత నిస్సందేహంగా మన తెలుగువారికి దక్కింది. ప్రపంచం నలుదిశలా ఉన్న తెలుగువారు, భారతీయులు అందరూ ఆశించినట్టుగానే తెలుగుపాటకు ఆస్కార్ పట్టాభిషేకం చేసింది. ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఒపస్ ‘ట్రిపుల్ ఆర్’ చిత్రానికి ఎమ్.ఎమ్.కీరవాణి స్వరపరచిన బాణీలకు అనువుగా చంద్రబోస్ పలికించిన “నాటు నాటు…” పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ లభించింది. అంత ఖర్చు పెట్టారు, ఇంత ఖర్చు పెట్టారు. అందువల్లే ఆస్కార్ వచ్చింది అంటూ కొందరు కువిమర్శలు చేశారు. నిజానికి అక్కడ నామినేషన్ దక్కించుకున్న చిత్రాలకు ప్రచారం చేయడానికి కొంత ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఆస్కార్ సభ్యులకు మనం నామినేషన్ దక్కించుకున్న విభాగంలోని అంశాన్ని ప్రదర్శించడానికి, వారికి మన భాషను వివరించడానికి తదితర అంశాలకు కొంత ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆ ఖర్చు మన కరెన్సీలో అధికంగా కనిపించవచ్చు. అంతేకానీ, ఇదేదో డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిన అవార్డులు కావు. నిస్సందేహంగా ప్రతిభకు పట్టాభిషేకం చేసేవే ఆస్కార్ అవార్డులు!
Read Also: Oscars 95: బెస్ట్ ఒరిజినల్ సాంగ్…
మన తెలుగు పాట “నాటు నాటు…” ఆస్కార్ నామినేషన్ పొందిన దగ్గర నుంచీ సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోట్లాది భారతీయులు ఆ పాటకే ఆస్కార్ పట్టాభిషేకం చేయాలని అభిలషించారు. ప్రార్థనలూ చేశారు. అందరి అభిమానుల ప్రార్థనలు ఫలించాయి. ఆస్కార్ వేదికపై మన తెలుగు సంగీత దర్శకులు ఎమ్.ఎమ్.కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆ పాటతో ఒక్క వెలుగు వెలిగారు. ఈ పాటతో పోటీపడ్డ పాటలేమీ తక్కువవి కావు. ఇది విమర్శలు చేసేవారు గమనించాల్సిన అంశం. ‘బ్లాక్ పాంథర్ : వకాండా ఫరెవర్’లో గాయని రిహానా ఆలపించిన “లిఫ్ట్ మీ అప్…” సాంగ్ అమెరికాలోని చార్ట్ బస్టర్స్ లోనూ, మరికొన్ని దేశాల్లోనూ ఎన్నో వారాలు టాప్ వన్ గా నిలచింది. ఇక ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’లోని “దిస్ ఈజ్ లైఫ్…” సైతం ఎంతగానో అలరించింది. ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమన్’లోని “అప్లాజ్…” పాట కూడా జనాన్ని పరవశింప చేసినదే. అన్నిటినీ మించి హాలీవుడ్ లో విశేషమైన క్రేజ్ ఉన్న లేడీ గగా ‘టాప్ గన్: మేవరిక్’లో పాడిన “హోల్డ్ మై హ్యాండ్…” పాట సైతం అమెరికన్లను ఓ ఊపు ఊపేసింది. ఇన్ని మంచి పాటలు బరిలో ఉన్నా, మన తెలుగు పాటకు పట్టాభిషేకం జరగడమంటే అది ప్రతిభకు పట్టం కట్టడమే కానీ, మరొకటి కాదని ఇప్పటికైనా విమర్శలు చేసేవారు గ్రహిస్తే మంచిది. సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ తో పాటు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ సైతం ఆస్కార్ వేడుకలో పాలుపంచుకున్నారు. అయితే అవార్డు తీసుకోవడానికి వేదికపైకి కీరవాణి, చంద్రబోస్ వెళ్ళారు. కీరవాణి ఇంగ్లిష్ లో మాట్లాడగా, చివరలో ‘నమస్తే’ అంటూ చంద్రబోస్ తెలుగులో ముక్తాయింపు ఇవ్వడం తెలుగువారందరికీ ఆనందం పంచుతోంది.
Read Also: Oscars 95: బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే…
చిత్రమేమిటంటే, ఈ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి కొన్ని గంటల ముందు ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం బుల్లితెరపై ప్రసారమయింది. అలాగే రెండు రోజుల ముందుగా ఈ సినిమా మళ్ళీ అనేక కేంద్రాలలో విడుదలై విజయవిహారం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయులందరి మదిలోనూ “నాటు నాటు…” పాట మారుమోగుతోంది. తెలుగువారికి తొలి ఆస్కార్, అందునా ఆసియా వాసులకు ‘ఒరిజినల్ సాంగ్’ విభాగంలో మొట్టమొదటి ఆస్కార్ వచ్చేలా చేసిన ‘ట్రిపుల్ ఆర్’ బృందాన్ని మొత్తం అభినందించి తీరవలసిందే!ఈ సందర్భంగా మన “నాటు నాటు…” సాంగ్ ను మననం చేసుకోవడమూ సముచితంగా ఉంటుంది. అందుకే మీ కోసం… ఆ పాట అక్షరూపంలో-
పొలం గట్టు దుమ్ములోన
పోట్ల గిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో
పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకుని
కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన
కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన
మిరప తొక్కు కలిపినట్టు
నా పాట సూడు
నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు
నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు
నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు
పచ్చి మిరప లాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు
విచ్చు కత్తి లాగ వెర్రి నాటు
గుండెలదిరిపోయేలా
డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలా
కీసు పిట్ట కూసినట్టు
ఏలు సిటికెలేసేలా
యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా
దుమారం రేగినట్టు
ఒల్లు సెమటపట్టేలా
వీరంగం సేసినట్టు
నా పాట సూడు
నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు
నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు
నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు గడ్డపార లాగ చెడ్డ నాటు
నాటు నాటు ఉక్కపోత లాగ తిక్క నాటు
భూమి దద్దరిల్లేలా
వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా
ఏసేయరో యకాయకి
నాటు నాటు నాటో
దుమ్ము దుమ్ము దులిపేలా
లోపలున్న పానమంతా
దుముకు దుముకులాడేలా
దూకేయరో సరాసరి
నాటు నాటు నాటో
హే అది
డా నాకరా డా నాకరా
డా నాకరా నాకరా నాకరా
నాకరా నాకరా నాకరా నాకరా