NTV Telugu Site icon

MPDO Venkata Ramana Case: మిస్సింగ్‌ మిస్టరీ వీడింది.. కానీ, ఎంపీడీవోది ఆత్మహత్యా..? ఇంకా ఏదైనా జరిగిందా..?

Mpdo

Mpdo

MPDO Venkata Ramana Case: సంచలనంగా మారిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం MPDO వెంకటరమణ మిస్సింగ్‌ మిస్టరీ క్లియర్‌ అయింది. ఆయన మృతదేహం లభ్యమైంది. విజయవాడ ఏలూరు కాలువలో నరసాపురం ఎంపీడీవో మృతదేహాన్ని స్పెషల్ టీం, ఎస్డీఆర్ఎఫ్ టీంలు వెలికి తీశాయి. ఆరు రోజుల వెతుకులాట తర్వాత ఆయన మృతదేహం లభ్యమైంది. మధురానగర్ వంతెన కింద గుర్రపు డెక్క తూడులో చిక్కుకుని మృతదేహం బయటపడింది‌‌‌. మృతదేహానికి గ్రీన్ ఇంక్ పెన్ను ఉండటంతో అది MPDOదేనని పోలీసులు నిర్ధారించారు.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

ఈ నెల 15న అర్ధరాత్రి భార్య ఫోన్‌కు మెసేజ్‌ పంపారు వెంకటరమణారావు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. ఆందోళనకు గురైన ఆయన కుటుంబసభ్యులు 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు ఏలూరు కాలువ వద్ద సిగ్నల్‌ కట్‌ అయినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కాలువలో గాలించారు. ఏలూరు కాల్వలోకి వెంకటరమణ దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావించారు. అదే కోణంలో స్పెషల్ పార్టీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎట్టకేలకు వారం రోజులు వెతకగా ఎంపీడీవో మృతదేహాన్ని వెలికి తీశారు. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌ అయిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఎంపీడీవో వెంకటరమణారావు మృతదేహం లభ్యమైంది. తీవ్రమైన ఒత్తిడితోనే వెంకటరమణ ఆత్మహత్య చేసుకుని ఉంటారని ఆయన కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Dharmendra Pradhan: సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..ఏమన్నారంటే..?

వెంకటరమణారావు విజయవాడ శివారులోని కానూరు మహదేవపురం కాలనీలో నివాసముంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఎంపీడీవోగా పని చేస్తున్న ఆయన సెలవు రోజుల్లో ఇంటికి వస్తుంటారు. ఈ నెల 10 నుంచి 20 వరకు సెలవు పెట్టి కానూరు వచ్చారు. 15న మచిలీపట్నంలో పని ఉందంటూ ఇంట్లో చెప్పి వెళ్లారు. ఆరోజు రాత్రి 10 గంటలకు ఫోన్‌ చేసి, తాను బందరులో ఉన్నానని, ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని తెలిపారు. తర్వాత అతని ఆచూకీ తెలియకపోగా, ఫోన్‌ కూడా పని చేయలేదు. స్కూటీపై మచిలీపట్నం వరకు వెళ్లారు వెంకటరమణారావు. పార్కింగ్ స్థలంలో బైక్ పార్క్ చేశారు. కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ ఎక్కిన వెంకటరమణ తన కుమారుడికి 3 పేజీల లెటర్ పంపారు‌. ఎక్కడికైనా ఊరూ వెళ్ళారా..? లేదా మధురా నగర్ బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారా..? అనే కోణంలోనూ కేసును దర్యాప్తు చేశారు పోలీసులు. వెంకటరమణారావు దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ చేసినా రెండో మొబైల్‌ని ట్రాక్‌ చేశారు పోలీసులు. రెండు మొబైల్స్‌ కూడా ఒకే మెయిల్ ఐడితో ఉండటం వల్ల మ్యాపింగ్ చేశారు. వెంకటరమణరావు ప్రయాణం చేసిన దారిలోని ప్రతీ సీసీ పుటేజిని పరిశీలించారు.

Read Also: Ratan Tata: ఒక్క ప్రకటనతో రూ.19 వేల కోట్లు రాబట్టిన రతన్ టాటా..ఆ ప్రకటన ఇదే…

నరసాపురం ఎంపీడీవో అదృశ్యం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయింది. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల నుంచి వాకబు చేశారు. వ్యవహారం సీరియస్‌ కావడంతో… వెంకటరమణారావు కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు మొదలుపెట్టారు. నలుగురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 150 మంది సిబ్బంది పని చేశారు. వెంకటరమణారావు మాధవాయిపాలెం ఫెర్రీ విషయంలో 55 లక్షల బకాయిలకు సంబంధించి తీవ్ర ఒత్తిడికి గురైనట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఫెర్రీ డబ్బులు 50 లక్షల రూపాయలు కాంట్రాక్టర్ వద్ద నుండి రావాల్సివుందని ఒకవేళ ఆ డబ్బులు రాకపోతే తనపై భారం పడుతుందని మదనపడినట్లు సుసైడ్ నోట్‌లో తన కుమారుడికి తెలిపారు. అలాగే కొన్ని అన్‌నోన్‌ ఫోన్‌ కాల్స్‌ కూడా వెంకటరమణారావును ఆందోళన పడేసినట్టు చెబుతున్నారు. కొంత డబ్బును కూడా ఆయన బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసినట్టు పోలీసులకు తెలిసింది. వీటన్నింటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే, వెంకటరమణరావు మృతికి స్పష్టమైన కారణాలు తెలియలేదని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు జరుగుతోందని.. పూర్తి వివరాలు త్వరలోనే బయటపడతాయని చెబుతున్నారు పోలీసులు.