Site icon NTV Telugu

Jasprit Bumrah: మరీ పొంగిపోను.. నా కాళ్లు నేలపైనే ఉంటాయి!

Jasprit Bumrah Icc Award

Jasprit Bumrah Icc Award

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు దక్కింది. ఐసీసీ అత్యున్నత పురస్కారం ‘ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ (2024) అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. సర్‌ గ్యారిఫీల్డ్‌ సోబర్స్‌ పేరిట ఇచ్చే ఈ పురస్కారం కోసం బుమ్రాతో పాటు జో రూట్, హ్యారీ బ్రూక్‌, ట్రావిస్‌ హెడ్‌ పోటీ పడ్డారు. 2024లో భారత్ టీ20 ప్రపంచకప్‌ గెలవడంలో బుమ్రా అత్యంత కీలక ప్రాత పోషించాడు. మరోవైపు గతేడాది టెస్టుల్లో స్వదేశం, విదేశం అని తేడా లేకుండా.. అన్ని చోట్లా రాణించాడు. 13 టెస్టు మ్యాచ్‌ల్లో ఏకంగా 71 వికెట్లు పడగొట్టాడు.

సర్‌ గ్యారిఫీల్డ్‌ సోబర్స్‌ అవార్డు దక్కిన సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఐసీసీ అత్యున్నత పురస్కారం రావడం పట్ల సంతోషంగా ఉన్నానని, మరీ పొంగిపోవట్లేదని తెలిపాడు. ‘ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ దక్కడం సంతోషంగా ఉంది. ఇదో గొప్ప భావన. నా చిన్నపుడు మన హీరోలు గొప్ప అవార్డులు గెలవడం చూశా. ఇప్పుడు నాకు ఆ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. 2024 టీ20 ప్రపంచకప్‌ 2024 గెలవడం ఎంతో ప్రత్యేకమైంది. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోను. టీ20 ప్రపంచకప్‌ నెగ్గడమే నాకు అత్యంత విలువైంది. సర్‌ గ్యారిఫీల్డ్‌ సోబర్స్‌ పురస్కారం రావడం పట్ల సంతోషంగా ఉన్నా కానీ.. మరీ పొంగిపోను. నా కాళ్లు ఎప్పుడూ నేలపైనే ఉంటాయి’ అని బుమ్రా పేర్కొన్నాడు.

Also Read: Rohit Sharma: రోహిత్‌, యశస్వి, శ్రేయస్‌ లేకుండానే బరిలోకి జట్టు!

‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌’ అవార్డు గెలిచిన తొలి భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు నలుగురు ఈ అవార్డు గెలిచినా.. అందులో ముగ్గురు బ్యాటర్లు, ఓ స్పిన్నర్ ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ టెండూల్కర్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2017, 2018) ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. విరాట్ వరుసగా రెండు ఏళ్లు ఎంపికయ్యాడు.

Exit mobile version