బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్స్ తగులున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ నేతలంతా వరుసగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ జాయిన్ కాగా, ఇవాళ (గురువారం) ముథోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి హస్తం గూటికి చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి సీతక్క విఠల్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించింది.
ఇక, 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన విఠల్ రెడ్డి.. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని చాలా కాలంగా బీఆర్ఎస్ పార్టీలో ప్రచారం కొనసాగింది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి ఇద్దరూ కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇంద్రకరణ్‌రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేశారు. దీంతో ఇంద్రకరణ్‌రెడ్డి కంటే ముందు విఠల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.