ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే గణపయ్య భక్తులు విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు. ఊరు వాడలు వినాయక మండపాలతో ముస్తాబవుతున్నాయి. కాగా గణేష్ వేడుకలకు ముందే ముంబైలోని జీఎస్బీ సేవా మండల్ హాట్ టాపిక్ గా మారింది. తమ వినాయకుడికి ఏకంగా రూ. 474 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకుంది. దీంతో రిచెస్ట్ గణపతిగా రికార్డ్ సృష్టించాడు. గతేడాది కూడా రికార్డ్ స్థాయిలో రూ. 400 కోట్లు, 2023లో రూ. 360 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంది. ఈ ఇన్సూరెన్స్ వినాయకుడి బంగారం, సిల్వర్ అభరణాలతో పాటు, వాలంటీర్లు, పూజారులు, సెక్యూరిటీ గార్డులు, సిబ్బందిని, దర్శనానికి వచ్చే భక్తులను కవర్ చేస్తుంది.
అందిన సమాచారం ప్రకారం, GSB మండలంలో రూ.67 కోట్ల విలువైన గణపతి ఆభరణాలు ఉన్నాయి. ఇందులో 325 కిలోల వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో, మండల కార్మికులు, పూజారులు, వంటవారు, భద్రతా గార్డులకు మొత్తం రూ.375 కోట్ల బీమా చేయించారు. అగ్నిప్రమాదాల నివారణ, భూకంపం వంటి విపత్తుల వల్ల నష్టాలను నివారించడానికి మండల్ రూ.2 కోట్ల బీమాను తీసుకుంది. అదే సమయంలో, గణేశోత్సవం కోసం నిర్మిస్తున్న మండల్, దర్శనానికి వచ్చే భక్తులకు రూ.30 కోట్ల బీమా చేయించారు. ఈ సమాచారాన్ని GSB సేవా మండల్ అధ్యక్షుడు అమిత్ పాయ్ అందించారు. జిఎస్‌బి గణపతి ముంబైలోని అత్యంత ధనిక గణపతి మండలం. గణేష్ చతుర్థి సందర్భంగా ప్రతిరోజూ కనీసం 20,000 మంది భక్తులు దర్శనం కోసం వస్తారని బోర్డు తెలిపింది.
