ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుని తీవ్ర నిరాశలో ఉన్న ముంబై ఇండియన్స్ (MI) జట్టుకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ క్వింటన్ డికాక్, అలాగే పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ రాజ్ అంగద్ బావా మిగిలిన టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యారు. ఈ సీజన్‌లో ముంబైకి ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా, కీలక ఆటగాళ్లు దూరం కావడం జట్టుకు పెద్ద మైనస్‌గా మారింది.
ముంబై ఇండియన్స్ వైద్య బృందం వెల్లడించిన వివరాల ప్రకారం.. క్వింటన్ డికాక్ ఎడమ మణికట్టుకు తీవ్ర గాయమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన హోమ్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో బంతి బలంగా తగలడంతో డికాక్ మణికట్టుకు ఈ గాయం అయింది. మరోవైపు యువ ఆల్‌రౌండర్ రాజ్ అంగద్ బావా.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా కుడిచేతి బొటనవేలి లిగమెంట్ చిరిగింది. ఇద్దరి గాయాలు తీవ్రమైనవి కావడంతో వారు ఈ సీజన్‌లో మళ్లీ మైదానంలోకి దిగడం అసాధ్యమని తేలింది.
ఈ సీజన్‌లో ఇద్దరి ప్రదర్శన..
దక్షిణాఫ్రికా స్టార్ డికాక్ ఈ సీజన్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఏప్రిల్ 16న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 112 పరుగులతో అద్భుతమైన అజేయ సెంచరీతో సీజన్‌ను ఘనంగా ప్రారంభించాడు. ఆ తర్వాత ఏప్రిల్ 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో చివరి మ్యాచ్ ఆడిన డికాక్.. ప్రాక్టీస్‌లో గాయపడి ఆ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక యువ ఆటగాడు రాజ్ అంగద్ బావా కూడా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున మూడు మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించి ఫర్వాలేదనిపించాడు.
ముంబై ఇండియన్స్ అధికారిక ప్రకటన..
దీనిపై ముంబై ఇండియన్స్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘క్వింటన్ డికాక్, రాజ్ బావా ఇద్దరూ తమ తమ స్వగృహాలకు వెళ్లి పునరావాసం పొందుతారు. వారు వీలైనంత త్వరగా కోలుకుని తిరిగి మైదానంలోకి వచ్చేలా ముంబై ఇండియన్స్ వైద్య బృందం వారికి నిరంతరం మార్గదర్శకత్వం, మద్దతు అందిస్తుంది’ అని తెలిపింది. అలాగే వారిద్దరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లను త్వరలోనే భర్తీ చేస్తామని మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.
ముంబై ఇండియన్స్ బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో, ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో తమ చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ప్లేఆఫ్స్ ఆశలు లేకపోయినా.. సీజన్‌ను గౌరవప్రదంగా ముగించాలనుకుంటున్న ముంబైకి ఈ గాయాలు పెద్ద ఆందోళన కలిగించే విషయమే.
