Site icon NTV Telugu

Mumbai Terror Attacks: భారతావని మరువలేని మారణహోమానికి 14 ఏళ్లు.. ఆ గ్రామానికి కానిస్టేబుల్ పేరు..

Mumbai Terror Attacks

Mumbai Terror Attacks

Mumbai Terror Attacks 26/11: నవంబర్‌ 26, 2008న ముంబయిలో జరిగిన ఉగ్రదాడితో భారతావనితో పాటు యావత్‌ ప్రపంచం వణికిపోయిన విషయం తెలిసిందే. భారత్‌తోపాటు మరో 14దేశాలకు చెందిన మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ మారణహోమం జరిగి నేటికి 14ఏళ్లు అయ్యింది. లష్కరే ఉగ్రమూకలు.. ముంబయిలోని 12 చోట్ల సృష్టించిన నరమేధంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముంబయికి చెందిన పోలీసు ఉన్నతాధికారులు కూడా అమరులయ్యారు. వందల సంఖ్యలో సామాన్యులు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ముష్కరదాడుల్లో అమరుడైన ఓ కానిస్టేబుల్​ పేరును మహారాష్ట్రలో ఆయన స్వగ్రామానికి పెట్టారు.

అసలేం జరిగిందంటే.. పాకిస్థాన్‌కు చెందిన పదిమంది ఉగ్రవాదులు.. నవంబర్‌ 26, 2008 సాయంత్రం కొలాబా సముద్రతీరం నుంచి ముంబయికి చేరుకొన్నారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన ముష్కరులు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్‌లోకి చొరబడ్డారు. వెంటనే వారిచేతుల్లో ఉన్న ఏకే-47 తుపాకులను తీసి తూటాల వర్షం కురిపించారు. అక్కడ కన్పించిన వారినల్లా పిట్టల్లా కాల్చి చంపారు. ఊహించని ఘటనలతో వణికిపోయిన అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపే దాదాపు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన ఉగ్రవాదులు వీధుల్లోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత వరుసగా కామా హాస్పిటల్‌, ఒబెరాయ్‌ ట్రైడెంట్‌, తాజ్‌ హోటల్, లియోపోల్డ్‌ కేఫ్‌, నారిమన్‌ లైట్‌ హౌస్‌ ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల మోత మోగింది. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారిలో కేవలం భారతీయులే కాకుండా మరో 14 దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు.

Bharat Biotech: బూస్టర్‌ డోస్‌గా భారత్ బయోటెక్‌ చుక్కల మందు టీకా

ఊరికి ఆయన పేరు.. ముంబైలో జరిగిన 26/11 దాడుల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. 2008లో ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడి చేయగానే స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్ఆర్‌పీఎఫ్) కానిస్టేబుల్ రాహుల్ షిండే అందులోకి వెళ్లారు. అయితే ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ శరీరంలోకి చొచ్చుకెళ్లడంతో రాహుల్ షిండే మరణించారు. ఈ మేరకు ప్రాణాలు అర్పించిన ఆయన పేరును ఓ గ్రామానికి పెట్టారు. ఆయన త్యాగానికి గుర్తుగా రాహుల్ స్వగ్రామం సోలాపుర్ జిల్లా ‘సుల్తాన్‌పుర్’ గ్రామానికి ‘రాహుల్ నగర్’ అని పేరు మార్చాలని గ్రామస్థులు నిర్ణయించారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే రాహుల్ షిండే మరణానంతరం కేంద్ర ప్రభుత్వం ఆయన త్యాగానికి గుర్తుగా రాష్ట్రపతి పోలీస్ పతాకాన్ని ప్రదానం చేసింది. తాజాగా తమ గ్రామం పేరు మార్పునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని.. తాము అధికారుల ప్రకటన కోసం వేచి చూస్తున్నామని దివంగత రాహుల్ షిండే తండ్రి సుభాష్ విష్ణు షిండే మీడియాకు తెలియజేశారు.

బాధితులకు న్యాయం జరిగేంతవరకు భారతదేశం తన ప్రయత్నాలను ఎప్పటికీ వదులుకోదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఈరోజు 14వ వార్షికోత్సవం సందర్భంగా 26/11 ముంబై ఉగ్రదాడుల బాధితులను భారతదేశం స్మరించుకున్న సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. “ఈ దాడికి ప్లాన్ చేసిన, పర్యవేక్షించిన వారిని తప్పనిసరిగా శిక్షించాలి” అని ట్వీట్ చేశారు. 166 మంది మరణించిన మరియు 300 మందికి పైగా గాయపడిన ఘోరమైన దాడి నుంచి చిత్రాలను కలిగి ఉన్న ఒక చిన్న వీడియోను ఆయన పంచుకున్నారు.

Exit mobile version