Mulugu: భార్య చేతిలో మరో భర్త బలి? ప్రియుడితో కలిసి ఘాతుకం..!

Mulugu

Mulugu

Mulugu: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని నేలారిపేట గ్రామ శివారులో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నివాసముంటున్న పూనెం నాగరాజు (36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన తమ్ముడిది సహజ మరణం కాదని, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్యే తన ప్రియుడితో కలిసి హత్య చేసిందని మృతుడి అన్న, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు, మృతుడి భార్య పూనెం జ్యోతితో పాటు బెస్తగూడెం గ్రామానికి చెందిన ఆమె ప్రియుడు గుండారపు సత్యంను అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు సత్యంతో కలిసి భార్య జ్యోతి తన భర్తకు చున్నీతో ఉరితాడు బిగించి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.