NTV Telugu Site icon

Mudragada Padmanabham: అమావాస్యే అడ్డు..! త్వరలో శుభవార్త వింటారు..

Mudragada

Mudragada

Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గూటికి చేరడం దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది.. ఈ రోజు వైసీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌, ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు కాకినాడ జిల్లాకు చెందిన పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు అంతా.. కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి.. ఆయనతో సమావేశం అయ్యారు.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చామని.. పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. అయితే, ఆయన ఆలోచించి తన నిర్ణయం చెబుతానని చెప్పినట్టుగా వైసీపీ నేతలు చెబుతున్నారు.. మరోవైపు.. తన అనుచరులతో ముద్రగడ పద్మనాభం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. త్వరలోనే శుభవార్త వింటారని.. అమావాస్య తర్వాత దానికి సంబంధించిన నిర్ణయం చెబుతానన్నారట.. మనకి ఉన్నత అవకాశం ఇచ్చే వారిని మనం గౌరవించాలి.. కచ్చితంగా రాజకీయాలు చేస్తాను అంటూ తన అనుచరుల దగ్గర ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారట..

Read Also: Indigo : విమానం సీటు పై కనిపించని కుషన్లు.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్

కాగా, ముద్రగడ పద్మనాభంతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ మిథున్‌రెడ్డి.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలు మేరకు ఇక్కడికి వచ్చామని.. వైసీపీలో చేరాలని ఆహ్వానించామని తెలిపారు. ముద్రగడ ఆలోచించి పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం అన్నారు. అంతేకాదు.. ముద్రగడకు ఎలాంటి ఆఫర్‌ ఇస్తున్నారు అని అడుగుతున్నారు.. కానీ, ఆయన బేషరతుగా వైసీపీలో చేరతారని భావిస్తున్నాం అన్నారు… పెద్దలను ఎలా గౌరవించాలో సీఎం జగన్ కి తెలుసన్న ఆయన.. ముద్రగడ పద్మనాభం.. వైసీపీలో చేరడానికి ఒప్పుకున్న తర్వాత మిగతా విషయాలు చర్చిస్తామని మిథున్‌ రెడ్డి తెలిపిన విషయం విదితమే.