Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన వైసీపీ చేరికపై స్పష్టత ఇచ్చారు. ఆయనే స్వయంగా స్పందించారు. ఈనెల 14న వైసీపీలో చేరుతున్నానని ముద్రగడ పద్మనాభం చెప్పారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నానని వెల్లడించారు. ఉదయం కిర్లంపూడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 నుంచి 6 మధ్య పార్టీలో చేరిక ఉంటుందన్నారు. జగన్‌కి మద్దతుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. సంక్షేమ పథకాలు పేదవారికి అందడానికి తన వంతుగా పార్టీలో చేరుతున్నానన్నారు. ఎటువంటి కండిషన్ లేకుండా పార్టీలో చేరుతున్నానని ఆయన స్పష్టం చేశారు. తనకు, తన కుమారుడికి ఎటువంటి సీటు అడగలేదన్నారు. దేవుడి దయ వల్ల జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు ఏమైనా పదవి ఇస్తే తీసుకుంటానని ఆయన చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానన్న ముద్రగడ పద్మనాభం.. వైసీపీ తరఫున ప్రచారం చేస్తానన్నారు. తనకు, తన కుటుంబానికి ఎటువంటి పదవి కాంక్ష లేదన్నారు.
Read Also: Mudragada Padmanabham: ఈ నెల 14న వైసీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం
కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రత్తిపాడు నియోజక వర్గం నుంచి ముద్రగడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978, 1983, 1985,1989 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేగా గెలిచారు. 1978లో జనతా పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ, 1983, 1985లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 1994లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్తిపాడు నియోజక వర్గం లో ముద్రగడ కుటుంబం ఆరుసార్లు గెలుపొందింది. పద్మనాభం ఓ సారి ఎంపీగా కూడా గెలిచారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. 1994లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఓడిపోయిన ముద్రగడ 1999లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పిఠాపురంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 లో కాంగ్రెస్ తరపున పిఠాపురం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో ఉన్నారు ముద్రగడ. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమించారు.ఆ తర్వాత కాలంలో ఆయన ఏదొక రాజకీయ పార్టీలో చేరుతారని పలు సందర్బాల్లో ప్రచారం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ముద్రగడ తనయుడికి నామినేటెడ్ పదవిని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందే ముద్రగడ కుమారుడికి నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.