Site icon NTV Telugu

Nuziveedu: రసవత్తరంగా నూజివీడు రాజకీయం.. ఆ ఇద్దరి మధ్య కోల్డ్‌ వార్..!

Nuziveedu

Nuziveedu

Nuziveedu: నూజివీడు టీడీపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక్కడ ఇంఛార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, అనధికారిక ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే పార్థసారధి మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది. నూజివీడు నియోజకవర్గంగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని క్యాడర్ వాపోతున్నారు.. పెనమలూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి.. వచ్చే ఎన్నికల్లో నూజివీడు నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగటానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారట. దీంతో, నూజివీడులో తన వర్గాన్ని పూర్తిస్థాయిలో మోహరించిన సారథి.. పార్టీలోకి అధికారికంగా చేరకపోయినా ఇంఛార్జ్‌గా తాను చేయాల్సిన పనులను పెనమలూరు నుంచే చక్కబెట్టేస్తున్నారట.

అయితే, ఈ పరిణామాలన్నీ కూడా నూజివీడు టికెట్ ఆశిస్తున్న ప్రస్తుత ఇంఛార్జ్‌ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు కాకపుట్టిస్తున్నాయని సమాచారం. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తామని చంద్రబాబు చెప్పారని ఇప్పటికీ ముద్దరబోయిన తన వర్గానికి చెబుతున్నారట. మరోవైపు సారథి స్పీడు మాత్రం ఆయన్ని కలవరపెడుతున్నాయనేది లోకల్ టాక్. పెనమలూరు సీటును టీడీపీ నుంచి కూడా పార్ధసారథి మొదట్లో ఆశించారు. అయితే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. దీంతో చంద్రబాబు ఆదేశాల మేరకు సారథి నూజివీడు నుంచి పోటీ చేయటానికి సిధ్ధపడ్డారట. తనకు పెనమలూరు ఇవ్వటంలేదు కాబట్టి తన సన్నిహితుడుగా ఉన్న రాజీనామా చేసిన కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ కు పెనమలూరు కోటాలో టికెట్ ఇవ్వాలని పార్ధసారథి కోరినట్టు సమాచారం.

ఇక, నూజివీడు వెళ్లటం ఖాయమని సారథికి తెలిసిన వెంటనే అక్కడ నేతలకు ఆయన టచ్ లోకి వెళ్లారట.. వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని వారందరీని కోరారు. ఇది ముద్దరబోయిన దృష్టికి వెళ్లడంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ సారథి తీరు సరికాదని విమర్శించారు. పార్టీలో చేరకుండా ఇలా ఎలా చేస్తారంటూ రుసరుసలాడారు. ఇదంతా జరిగిన తర్వాత కూడా సారథి స్పీడు పెంచారు తప్ప ఆగలేదట. ఏలూరు పార్లమెంటు పరధిలో జరిగిన చంద్రబాబు రా కదిలిరా సభకు సారథి తన నేతృత్వంలో ఉన్న ముఖ్యనేతలతో జనసమీకరణ జరపారు. ఆ కార్యక్రమానికి సారథి హాజరుకానప్పటికీ తన వర్గం నేతలు, క్యాడర్ అక్కడకు వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి వెళ్లిన సారథి క్యాడర్ తమ తమ వాహనాలపై కొలుసు పార్ధసారథి, టీడీపీ – నూజివీడు అని ముద్రించిన స్టిక్కర్లను తమ వాహనాలకు అంటించి వెళ్ళారు. ఇప్పుడు ఆ స్టిక్కర్లతోపాటు మీటింగ్ లో సారథి వర్గానికి చెందిన ముఖ్యనేతలు హల్ చల్ చేసి చేసిన ఫొటోలు లోకల్ వాట్సప్ గ్రూపుల్లో వైరల్ కావటంతో ముద్దరబోయిన వర్గానికి మింగుడు పడటంలేదట. అయితే, ఇటు సారథి.. అటు ముద్దరబోయిన ఇద్దరూ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. దీంతో ఇప్పటి వరకు టీడీపీ అంతర్గత పోరుగా ఉన్న నూజివీడు వ్యవహారం ఈ ఇద్దరు నేతల మధ్య ఫైట్ తో యాదవ్ వర్సెస్ యాదవ్ అనే రీతిగా మారిందనే చర్చ సాగుతోంది.

Exit mobile version