Site icon NTV Telugu

MS Dhoni: ఆ నలుగురు టీమిండియా ఆటగాళ్లతో మళ్లీ ఆడాలనుంది: ధోనీ

Ms Dhoni Team India

Ms Dhoni Team India

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న మహీ.. కీపర్, బ్యాటర్‌గా సేవలందిస్తున్నాడు. తన సహచర ప్లేయర్స్ సురేష్ రైనా, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి వారు ఇప్పటికే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. 43 ఏళ్ల ధోనీ ఇంకా కొనసాగుతున్నాడు. అయితే తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ధోనీ.. తనకు ఎదురైన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. గతంలో భారత జట్టులోని నలుగురు క్రికెటర్లతో మరలా తనకు ఆడాలనుందని తెలిపాడు.

గతంలో భారత జట్టులోని ఎవరితో కలిసి మళ్లీ ఆడాలని కోరుకుంటున్నారు అనే ప్రశ్నకు ఎంఎస్ ధోనీ సమాధానం ఇచ్చాడు. ‘మళ్లీ అవకాశం వస్తే సచిన్‌ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌లతో కలిసి ఆడాలని కోరుకుంటున్నా. సెహ్వాగ్‌ ఇన్నింగ్స్‌ను బాగా ఓపెనింగ్ చేస్తాడు. కొన్ని సందర్భాల్లో పరిస్థితి క్లిష్టంగా ఉంటుంది. ఆ పరిస్థితిలో ఆడడం, ఎలా ఆడాలో నిర్ణయించుకోవడం చాలా కష్టం. అలాంటి సమయాల్లోనూ ఈ నలుగురు ఆటగాళ్లు ఎలా ఆడారో మనం చూశాం. ఒకప్పుడు సెహ్వాగ్, గంగూలీ ఆడుతుంటే బాగుండేది’ అని ధోనీ చెప్పాడు.

Also Read: MS Dhoni Retirement: ఐపీఎల్‌ రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన ఎంఎస్ ధోనీ!

1983లో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్.. 28 ఏళ్ల తర్వాత ఎంఎస్ ధోనీ సారథ్యంలో 2011లో మరోసారి ట్రోఫీని ముద్దాడింది. అంతకుముందు మహ్మద్ అజారుద్దీన్ (1992, 1996, 1999), సౌరవ్ గంగూలీ (2003), రాహుల్ ద్రవిడ్ (2007)లు కప్ కొట్టడంలో విఫలమయ్యారు. అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్‌ను మహీ టీమిండియాకు అందించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను కూడా ధోనీ ఖాతాలో ఉన్నాయి. సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఆర్ అశ్విన్ లాంటి దిగ్గజాలు మహీ కెప్టెన్సీలో ఆడారు. అంతేకాదు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి ప్రస్తుత ప్లేయర్స్ కూడా ఆడారు.

Exit mobile version