టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్స్ ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తన కొడుకు పదేళ్ల కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించారు. సంజూ నైపుణ్యాన్ని గుర్తించి జట్టులో అవకాశం ఇచ్చిన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు విశ్వనాథ్ ధన్యవాదాలు తెలిపారు. సంజూ ఎప్పుడూ రికార్డుల కోసం ఆడడని, కొందరు స్వార్థం కోసం ఆడుతారని చెప్పుకొచ్చారు.
2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన సంజూ శాంసన్.. 9 సంవత్సరాలుగా భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించలేకపోయాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్ అనంతరం అతడికి జట్టులో చోటు దక్కింది. బంగ్లాదేశ్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన సంజూ.. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో విధ్వంసకర శతకంతో ఆకట్టుకున్నాడు. దాంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుస మ్యాచ్‌ల్లో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. దక్షిణాఫ్రికాపై రెండో మ్యాచ్‌లో డకౌట్ అయినా.. మిగతా రెండు మ్యాచ్‌ల్లో రాణిస్తాడని అందరూ అంటున్నారు. 2026 టీ20 ప్రపంచకప్‌లో సంజూ కీలక పాత్ర పోషిస్తాడని అంచనా.
సంజూ శాంసన్ వరుస మ్యాచ్‌ల్లో సెంచరీ చేయడంపై అతడి తండ్రి శాంసన్ విశ్వనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశ్వనాథ్ మాట్లాడుతూ… ‘భారత జట్టు మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సరైన అవకాశాలు ఇవ్వకుండా నా కొడుకు పదేళ్ల క్రికెట్ కెరీర్‌ను నాశనం చేశారు. అయినా నా కొడుకు ఏనాడూ బాధపడలేదు. భారత జట్టులో చోటు కోసం ప్రయత్నం చేశాడు. మాజీ ఆటగాడు క్రిష్ శ్రీకాంత్ మాటలు మమ్మల్ని బాధించాయి. బంగ్లాదేశ్ లాంటి సాధారణ జట్టుపై సంజూ సెంచరీ సాధించాడని విమర్శించాడు. ఏ జట్టు మీద చేసినా..సెంచరీ సెంచరీనే. సచిన్, ద్రవిడ్ మాదిరి సంజూకు మంచి క్లాసికల్ టచ్ ఉంది. ప్రోత్సహించకున్నా సరే.. కనీస మర్యాద ఇవ్వకుంటే ఎలా’ అని బాధపడ్డారు.
Also Read: Rohit Sharma: చరిత్రను తిరగరాసిన రోజు.. రోహిత్ రికార్డు దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలే!
‘సంజూ శాంసన్‌కు వరుసగా అవకాశాలు రావడంతో చాలా సంతోషంగా ఉన్నా. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు కృతజ్ఞతలు. ఈ ఇద్దరూ లేకుంటే సంజూను మళ్లీ పక్కనపెట్టేవారు. నా కొడుకు సాధించిన మొదటి శతకాన్ని ఈ ఇద్దరికీ అంకితమివ్వాలనుకుంటున్నా. సంజూ వరుస సెంచరీలు చేయడం ఇలాగే కొనసాగాలి. కొంతమంది స్వార్థం కోసం ఆడుతారు. సంజూ అలా కాదు. భారత జట్టు కోసం నా కొడుకు ఎన్నో సాధిస్తాడనే నమ్మకం ఉంది’ అని శాంసన్ విశ్వనాథ్ ధీమా వ్యక్తం చేశారు.