NTV Telugu Site icon

MS Dhoni Retirement: ఐపీఎల్‌ రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన ఎంఎస్ ధోనీ!

Ms Dhoni Retirement

Ms Dhoni Retirement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)కు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని రెండు రోజుల క్రితం వార్తలొచ్చిన విషయం తెలిసిందే. శనివారం చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను ధోనీ తల్లిదండ్రులు పాన్‌ సింగ్, దేవకి దేవిలు వీక్షించడమే ఇందుకు కారణం. సాధారణంగా మహీ తల్లిదండ్రులు మ్యాచ్‌లు చూసేందుకు రారు. కానీ ఢిల్లీ మ్యాచ్‌కు రావడంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే మ్యాచ్‌ అనంతరం ధోనీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఎంఎస్ ధోనీ తన ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చాడు. ‘ఇప్పటికిప్పుడు ఐపీఎల్‌కు నేను రిటైర్మెంట్ ప్రకటించను. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నా. ఐపీఎల్‌లో ఆడడంపై ప్రతి ఏడాది సమీక్షించుకుంటా. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. జులైలో 44 ఏళ్లు వస్తాయి. వచ్చే ఐపీఎల్‌లో ఆడాలా? వద్దా? అని నిర్ణయించుకోవడానికి నాకు ఇంకా 10 నెలల సమయం ఉంది. నా రిటైర్మెంట్‌ నిర్ణయించేది నేను కాదు. నా శరీరం నా రిటైర్మెంట్‌ను నిర్ణయిస్తుంది . ఐపీఎల్ ప్రారంభానికి ముందు శరీరం సహకరిస్తోందనిపిస్తే ఆడతా. ఇక చాలు అని నాకు అనిపించేంతవరకు ఇలానే కొనసాగుతా’ అని ధోనీ స్పష్టం చేశాడు.

Also Read: SRH vs GT: సన్‌రైజర్స్‌ పరాజయాల పరంపర.. గుజరాత్‌ హ్యాట్రిక్‌ విజయం!

గత రెండు సీజన్లుగా ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై ఎప్పటికపుడు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. గతేడాది ఎక్కువగా బ్యాటింగ్ చేయని ధోనీ.. ఈసారి రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఐపీఎల్ ఆరంభానికి రెండు నెలల ముందే చెన్నై వచ్చి ప్రాక్టీస్ మొదలెట్టి ఆ వార్తలకు చెక్ పెట్టాడు. ప్రతిసారి ధోనీ రిటైర్మెంట్‌ గురించి చెన్నై సీఈఓ, కోచ్ స్పందిస్తుంటారు. ఎలాంటి క్లారిటీ వారు అభిమానులను గందరగోళంలోకి నెట్టేస్తారు. మొదటిసారి మహీ స్వయంగా తన రిటైర్మెంట్‌పై స్పందించి ఓ క్లారిటీ ఇచ్చాడు.