India Top 5 ODI Captains: భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా టీమిండియా ఆల్‌టైమ్ టాప్-5 వన్డే కెప్టెన్ల జాబితాను ప్రకటించారు. నిజానికి ఈ జాబితాలో కొన్ని ఆసక్తికరమైన ఎంపికలు చోటుచేసుకున్నాయి. ఇందులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చివరి స్థానం దక్కగా.. సౌరవ్ గంగూలీ టాప్-3లో చోటు సంపాదించలేకపోయారు. ఈ జాబితాలో ఎంఎస్ ధోనీకి అగ్రస్థానం అప్పగించాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుంది. ఐసీసీ నిర్వహించే మూడు ప్రధాన వైట్‌బాల్ టోర్నమెంట్లను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ రికార్డు సృష్టించారు. ఆయన మొత్తం 200 వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించగా.. 110 విజయాలు అందించారు. 74 మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. మరో 11 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
ఈ జాబితాలో రెండో స్థానాన్ని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కు కేటాయించారు. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలోనే భారత్ తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆయన మొత్తం 74 వన్డేల్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇందులో భారత్ 39 విజయాలు సాధించగా.. 33 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇంకా ఆకాశ్ చోప్రా ఈ జాబితాలో మూడో స్థానంలో రోహిత్ శర్మ నిలిచారు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ 56 వన్డేలు ఆడగా.. 42 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై కాగా.. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. రోహిత్ నాయకత్వంలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది.
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఆకాశ్ చోప్రా నాలుగో స్థానం ఇచ్చారు. 1995 నుంచి 2005 మధ్య గంగూలీ మొత్తం 146 వన్డేల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇందులో భారత్ 76 మ్యాచ్‌ల్లో గెలవగా.. 65 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. గంగూలీ కెప్టెన్సీలో 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, శ్రీలంక సంయుక్త విజేతలుగా నిలిచాయి. అలాగే 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీకి ఐదో స్థానం దక్కింది. కోహ్లీ మొత్తం 95 వన్డేల్లో భారత జట్టుకు కెప్టెన్సీ చేయగా.. 65 విజయాలు అందించారు. 27 మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై కాగా.. మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. అయితే కోహ్లీ కెప్టెన్సీలో భారత్ ఎలాంటి ఐసీసీ ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. 2021లో చివరిసారిగా వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించారు. మొత్తంగా ఆకాశ్ చోప్రా ప్రకటించిన టాప్-5 జాబితాలో ధోనీ, కపిల్ దేవ్, రోహిత్ శర్మ, గంగూలీ, కోహ్లీ వరుసగా నిలిచారు.

