MS Dhoni on IPL Future: ఐపీఎల్ ముగియడం.. వచ్చే సీజన్‌లో ఎంఎస్ ధోనీ ఆడతాడా? లేదా? అనే చర్చ జరగడం సహజమే. 2020 నుంచే ఇదే జరుగుతోంది. ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత కూడా మహీ ఆడటంపై చర్చ జరిగింది. ఇప్పటికీ ధోనీ ఏ కార్యక్రమానికి హాజరైనా ఇదే ప్రశ్న ఎదురవుతోంది. తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మహీ పాల్గొనగా.. వచ్చే సీజన్‌లో ఆడుతారా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ తనదైన శైలిలో స్పందించాడు. వచ్చే సీజన్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పాడు. ఎల్లవేళలా ‘యెల్లో’ జెర్సీలోనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను ఆడినా, ఆడకపోయినా సీఎస్‌కేతో అనుబంధం మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని ఎంఎస్ ధోనీ స్పష్టం చేశారు. ‘నేను ఎప్పుడూ చెప్పే మాట ఒకటే. వచ్చే సీజన్‌లో ఆడటంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొన్ననే ఐపీఎల్ ముగిసింది. నాకు చాలా సమయం ఉంది. శరీరం సహకరిస్తే తప్పకుండా ఆడుతా. అంతా బాగుండాలనే నేను కోరుకుంటున్నా. మళ్లీ యెల్లో జెర్సీతోనే వస్తారా? అంటే.. ఎల్లవేళలా అని చెబుతా. నేను వచ్చే సీజన్‌లో ఆడతానా? లేదా? అనేది వేరే విషయం. నేను, సీఎస్‌కే ఎప్పుడూ కలిసే ఉంటాం. 15-20 సంవత్సరాలైనా సీఎస్‌కేతోనే నా ప్రయాణం’ అని ఎంఎస్ ధోనీ చెప్పాడు.
Also Read: Jagtial Murder: కాంగ్రెస్ నాయకుడి తల్లి దారుణ హత్య.. పోలీసుల అదుపులో రఘునందన్ రావు!
ఐపీఎల్ మొదటి ఎడిషన్ నుంచి ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనే ఆడాడు. చెన్నైకి 5 ట్రోఫీలు అందించారు. 2010, 2011, 2018, 2021, 2023లో సీఎస్‌కే ట్రోఫీ కైవసం చేసుకుంది. ధోనీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 278 మ్యాచ్‌లు ఆడి 5439 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మహీ అత్యధిక స్కోర్ 84 నాటౌట్. ఇప్పటివరకు 264 సిక్సర్లు, 375 ఫోర్లు బాదాడు. 44 ఏళ్ల ధోనీ ఐపీఎల్ 2026లో ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
