NTV Telugu Site icon

Happy Birthday MS Dhoni: కెప్టెన్‌లలో ‘ఎంఎస్ ధోనీ’ వేరే లెవెల్.. టాప్ రికార్డ్స్ ఇవే!

Ms Dhoni Birthday

Ms Dhoni Birthday

Happy Birthday MS Dhoni సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004లో ఎంఎస్ ధోనీని చూసి భారత క్రికెట్‌ను మ‌లుపు తిప్పే మొనగాడు వచ్చాడని ఎవ‌రూ గుర్తించ‌లేక‌పోయారు. వికెట్ కీప‌ర్ కొర‌త తీవ్రంగా వేధిస్తున్న స‌మ‌యంలో జుల‌పాల జుట్టుతో జట్టులోకి వ‌చ్చిన ధోనీ.. ఆ ఒక్క పాత్ర‌ను సమర్ధవంతంగా పోషిస్తే చాలనుకున్నారు అప్పటి బీసీసీఐ పెద్దలు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. వికెట్ కీపింగ్‌తో పాటు దూకుడైన ఆట‌తో భారత జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఆపై అనుకోకుండా వ‌చ్చిన కెప్టెన్‌ అవ‌కాశాన్ని నిల‌బెట్టుకోవ‌డ‌మే కాదు.. ఇండియ‌న్ టీమ్ మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ సారథిగా నిలిచాడు. నేడు ఎంఎస్ ధోనీ 43వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ నేప‌థ్యంలో మహీకి సంబందించిన కొన్ని రికార్డులను చూద్దాం.

ఎవరికీ సాధ్యం కానీ అరుదైన ఘనత:
క్రికెట్ ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కానీ అరుదైన ఘనతను ఎంఎస్ ధోనీ తన పేరిట లిఖించుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన మహీ.. మూడు దశాబ్దాలుగా ఊరించిన ప్రపంచకప్‌ను 2011లో అందించి యావత్ భారతం ఉప్పొంగేలా చేశాడు. అనంతరం 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచి.. ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచిన ఏకైక సారథిగా చరిత్రకెక్కాడు. ఈ రికార్డు మేమాహేమీలకు కూడా సాధ్యం కాలేదు.

అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం:
క్రికెట్ చరిత్రలోనే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 332 మ్యాచ్‌లకు మహీ కెప్టెన్సీ వహించాడు. ధోనీ తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్ (324) ఉన్నాడు. 60 టెస్టుల్లో ఒక జట్టుకు నాయకత్వం వహించిన ఏకైక వికెట్ కీపర్ కూడా మనోడే. టెస్ట్ కెప్టెన్‌గా 3454 పరుగులు చేశాడు. ఇది వికెట్ కీపర్ కెప్టెన్లలో అత్యధికం.

అత్యధిక విజయాలు:
భారత జట్టుకు అత్యధిక విజయాలందించిన కెప్టెన్ ఎంఎస్ ధోనీనే. మూడు ఫార్మాట్లలో కలిపి 332 మ్యాచ్‌ల్లో 178 విజయాలు అందించాడు. అంతేకాకుండా భారత క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వన్డేలకు సారథ్యం వహించిన ఘనత కూడా మహీ పేరుపైనే ఉంది. వన్డే ఫార్మాట్‌లో వికెట్ కీపర్ల జాబితాలో ధోనీదే వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్. 2005లో శ్రీలంకపై 183 పరుగులు చేశాడు.

వికెట్ కీపర్‌గా చరిత్ర:
అత్యధిక స్టంపౌట్స్ చేసిన రికార్డు ఎంఎస్ ధోనీ పేరిట ఉంది. మూడు ఫార్మాట్లో కలిపి 538 మ్యాచ్‌ల్లో 195 స్టంపౌట్స్ చేశాడు. ధోనీ తర్వాత కుమార సంగక్కర (594 మ్యాచ్‌లు..139 స్టంపౌట్లు) ఉన్నాడు. మొత్తం 829 ఔట్లలో పాలుపంచుకున్న మహీ.. వరల్డ్ బెస్ట్ కీపర్లలో ఒకడిగా నిలిచాడు.

Show comments