NTV Telugu Site icon

MP Vijayasai Reddy : విశాఖకు రైల్వే జోన్‌ రాకుంటే.. రాజీనామా చేస్తా..

Vijayasai Reddy

Vijayasai Reddy

ఏపీలో విశాఖ రైల్వే జోన్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అయితే దీనిపై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వే జోన్ అంశం పై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని ఆయన సవాల్‌ చేశారు. అంతేకాకుండా.. రైల్వే జోన్ రావటం లేదనే వార్తలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీ అని, అప్పటి ప్రధానమంత్రి కూడా రాజ్యసభలో ఈ అంశాన్ని స్పష్టం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఎంపీ బృందంతో వెళ్ళి కలిసినప్పుడు స్వయంగా రైల్వే శాఖ మంత్రి హామీ ఇచ్చారని, చివరి దశలో ఉంది… త్వరలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారన్నారు.

 

నిన్నటి సమావేశంలో అసలు రైల్వే జోన్ కు సంబంధించిన ప్రస్తావనే రాలేదని, కేవలం రైల్వే లైన్ పై మాత్రమే జరిగిందని ఆయన వెల్లడించారు. కొవ్వూరు మీదుగా తెలంగాణ ప్రాంతాలతో కనెక్ట్ చేయాలనే ప్రతిపాదన పై చర్చ జరుగలేదని, విభజన చట్టంలోనే ఈ ప్రతిపాదన ఉందన్నారు. విభజన చట్టంలో ఉన్నందున మొత్తం ఖర్చు కేంద్రమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని, రైల్వే లైన్ కోసం రాష్ట్ర వాటా ఇవ్వాలని కేంద్రం అడుగుతోందని, దీని పైనే నిన్న చర్చ జరిగిందని విజయసాయిరెడ్డి వివరించారు.