NTV Telugu Site icon

Uttam Kumar Reddy : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభివృద్ధి నిలిచిపోయింది

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో మున్సిపల్‌ పరిపాలనకు అవసరమైన నిధులు విడుదల చేయకుండా టీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ ఆరోపించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురువారం హుజూర్‌నగర్‌లో ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ప్రాంతాలు చిన్నపాటి వర్షానికి జలమయమవుతున్నాయన్నారు. 2014 నుంచి ప్రతిసారి ఈ సమస్యను పరిష్కరిస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇస్తోందని, గత ఎనిమిదేళ్లుగా ఎలాంటి మార్పు రాలేదన్నారు. 2022లో కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, పలు కూడళ్లలో నీరు నిలిచిపోవడంతో ఇవే సమస్యలు ఎదురవుతున్నాయన్నారు.

 

“గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నిధుల కొరత కారణంగా పెద్దగా పనులు చేయలేకపోయింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభివృద్ధి నిలిచిపోయిన ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు’’ అని ఆరోపించారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ‘‘హైదరాబాద్‌ను డల్లాస్‌ తరహాలో అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎప్పుడో హామీ ఇచ్చారు. అయితే గత కాంగ్రెస్ హయాంలో 2004-2014 వరకు జరిగిన అభివృద్ధిని కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది అని ఆయన వ్యాఖ్యానించారు.