NTV Telugu Site icon

MP Margani Bharat: కేంద్రమేమీ ఆకాశం నుండి ఊడి పడలేదు.. ఏపీకి తీరని అన్యాయమే చేసింది..

Margani Bharat

Margani Bharat

MP Margani Bharat: రాజమండ్రి నగరంలో అభివృద్ధిని గూర్చి మాట్లాడేటప్పుడు ఎవరో చెబితే కాదు.. ఆమె స్వయంగా చూసిన తరువాత మాట్లాడితే బాగుంటుందని ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరిని‌ ఉద్దేశించి హాట్‌ కామెంట్లు చేశారు రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్. రాజమండ్రిలోని మీడియా సమావేశంలో భరత్ మాట్లాడుతూ.. పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఒకవైపు రాజమండ్రిలో అభివృద్ధి జరగలేదని, మరోవైపు కేంద్రం నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని ఆమె అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఫస్ట్ అభివృద్ధి జరిగిందా, లేదా అనేది పురంధేశ్వరి స్పష్టంగా చెప్పాలన్నారు. ఇక కేంద్రం అనేది పైనుంచేమీ ఊడిపడలేదని, అన్ని రాష్ట్రాలూ ఇచ్చిన నిధులతోనే కేంద్రం మళ్లీ రాష్ట్రాలకు ఇస్తుందన్నారు. అంతే కానీ కేంద్రం తన సొంత ఖజానా నుంచి ఏమీ ఇవ్వడం లేదన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరు విషయంలో, రాష్ట్ర విభజన హామీలు అమలు విషయంలో తీరని అన్యాయం చేసిందని ఎంపీ భరత్ ధ్వజమెత్తారు‌.

Read Also: Rahul Gandhi: బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది.. జనజాతర సభలో రాహుల్

ఇక, ‌మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి ఇచ్చిన నిధులు, తదితర పథకాలూ తక్కువేనన్నారు ఎంపీ భరత్.. రాజమండ్రి అభివృద్ధి కోసం ఎంపీగా కేంద్రంతో దెబ్బలాడి నిధులు తీసుకొచ్చానన్నారు. గత ఎంపీ మురళీమోహన్ హయాంలో ఎందుకు అభివృద్ధి పనులు చేయలేదో చెప్పాలన్నారు. అప్పుడు టీడీపీ.. ఎన్డీఏతో అంటకాగే ఉంది కదా.. ఎందుకు మోరంపూడి ప్లే ఓవర్ బ్రిడ్జి, విమానాశ్రయం అభివృద్ధికి, రైల్వేస్టేషన్ అభివృద్ధికి, జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు తేలేకపోయారని ప్రశ్నించారు. కేంద్రంతో ఫైట్ చేసి సాధించిన తరువాత పారాచూట్ నుంచి దిగి ఈ అభివృద్ధి అంతా కేంద్రం ఇచ్చిన నిధులతోనే అంటే సరిపోదన్నారు. గతంలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, మేయర్లు రాజమండ్రి నగరానికి చేసిన అభివృద్ధి చెప్పగలరా? అని ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు. ‌స్థానికంగా ఉన్న నాయకులను కాదని ఎవరెవర్నో ఇక్కడికి వలస పక్షులు మాదిరిగా పంపిస్తే, తమ రాజకీయ లబ్ధి కోసం అవగాహన లేకుండా ఇలానే మాట్లాడతారని విరుచుకుపడ్డారు ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌.