NTV Telugu Site icon

Margani Bharat Open Challenge: చంద్రబాబుకు ఎంపీ భరత్‌ సవాల్‌.. ఒక్క ఆరోపణ నిరూపించినా రాజకీయాలు వదిలేస్తా..!

Margani Bharat

Margani Bharat

Margani Bharat Open Challenge: టీడీపీ అధినేత చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు ఎంపీ మార్గాని భరత్ రామ్.. ఒక్క ఆరోపణ నిరూపించినా రాజకీయాలు వదిలేస్తాను అటూ సవాల్‌ చేసిన ఆయన.. నీకు దమ్ముంటే నీ కొడుకును నాపై పోటీకి దింపు అని చాలెంజ్‌ చేశారు.. స్కీమ్ ల పేరుతో భారీ స్కామ్ ల చేసి అడ్డంగా దొరికిపోయి రాజమండ్రి జైలులో ఉన్న నువ్వా చంద్రబాబూ నన్ను విమర్శించేది.. నువ్వు రాజమండ్రి రూరల్ కాతేరులో నాపై చేసిన‌ ఆరోపణలలో ఒక్కటైనా నిరూపించగలవా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. రాజమండ్రిలో భరత్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన‌ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నీతి, నిజాయితీగా రాజకీయ సేవ చేయడానికి వచ్చానే కానీ.. నీకులా, ఇక్కడ నీ పార్టీ వాళ్ళలా రాజకీయాలను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించడానికి రాల్లేదన్నారు. నా ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నా.. పేరు కోసం, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించడం కోసమని అన్నారు.

Read Also: Astrology: జనవరి 30, మంగళవారం దినఫలాలు

రాజమండ్రిలో మీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల్లా వడ్డీ వ్యాపారాలు, చీట్ల వ్యాపారాలు చేసి అడ్డంగా దొరికి సెంట్రల్ జైలులో ఉండి వచ్చారు.. వారిని పక్కన పెట్టుకుని నన్ను విమర్శించడం దొంగే దొంగ అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు ఎంపీ భరత్‌ రామ్‌.. ఆవ భూముల్లో నా వాటా రూ.150 కోట్లు ఎవరిచ్చారు.. నిజంగా నువ్వు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఎంపీ భరత్ చాలెంజ్ విసిరారు. మా ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆసరా పథకం‌ కింద రాష్ట్రంలో 80 లక్షల మంది మహిళలకు రూ.25 వేల కోట్లు ఇచ్చారు.. నువ్వు ఇవ్వగలవా అని ప్రశ్నించారు. మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలెండర్లు అంటున్నావు.. ఆ స్కీమ్ జన్మభూమి కమిటీలకు, మీ కార్యకర్తలకు తప్పిస్తే రాష్ట్రంలోని అర్హులైన వారికి కాదనే సంగతి అందరికీ తెలుసు. నేను చాలెంజ్ చేస్తున్నా.. రాష్ట్రంలో 80 లక్షల మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తావా అని ఎంపీ ప్రశ్నించారు. ఒక వేలు అవతలి వారిని చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్ళు మనల్ని చూపిస్తాయనే విషయం మరిచిపోకూడదని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, పైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇన్సైడర్ ట్రేడింగ్.. పోలవరం ప్రాజెక్టు నిధులు స్వాహా.. ఇలా ప్రజాధనాన్ని లూటీ చేసిన నువ్వు నన్ను విమర్శిస్తావా అని ప్రశ్నించారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఎవరి వద్దైనా 15 శాతం వాటా తీసుకున్నానని నిరూపించగలవా చంద్రబాబు అని ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు. ‌రాజమండ్రి నగరాన్ని రెండున్నర సంవత్సరాలలో ఏ విధంగా అభివృద్ధి చేశానో చూడు.. మరి మీ పార్టీ పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం ఊడబొడిచారో చెప్పగలవా అని ప్రశ్నించారు. రాజమండ్రి జైలులో ఉన్నావు కదా.. సెంట్రల్ జైలు ఏ విధంగా అభివృద్ధి చేశాను చూసే ఉంటావు.. ఎవరి గురించైనా విమర్శించేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అన్నారు. రీల్స్ మాస్టర్ అన్నావు. నేను మల్టీ టాలెంటెడ్ ని.. నీకులా స్కీంల పేరుతో స్కాంలు చేయడం మాత్రం చేతకాదు.. అవసరం లేదన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌.