విజయవాడలో క్రికెట్ అకాడమీ స్థాపనకు కృషి చేస్తాం అని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. ఏపీ రాజధాని అమరావతితో పాటు విజయవాడ అభివృద్ధికి పాటుపడతాం అని తెలిపారు. నేడు విజయవాడలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అథిదులుగా హజరయ్యారు. ఈ ఇద్దరిని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు.
ఆత్మీయ సమావేశం సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ… ‘అమరావతిలో 2027లో నేషనల్ గేమ్స్ నిర్వహించేందుకు కృషి చేస్తాం. మంగళగిరిలోని క్రికెట్ స్టేడియాన్ని ఆరు నెలల్లో ప్రారంభిస్తాం. విజయవాడలో క్రికెట్ అకాడమీ స్థాపనకు కృషి చేస్తాం’ అని తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సమస్యలపై ఎంపీ శివనాథ్ సానుకూలంగా స్పందించారు. ఇటీవల ఎంపీ కేశినేని శివనాథ్ ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే నెల 8న విడుదల కానుంది.
Also Read: Kurnool Onion Price: కర్నూలు ఉల్లికి భారీ డిమాండ్.. కారణం ఏంటంటే?
ఏసీఏ అధ్యక్షుడితో పాటు అపెక్స్ కౌన్సిల్‌లోని ఆరు పదవులకు తాజాగా విశాఖ స్టేడియంలో నామినేషన్లు స్వీకరించారు. అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్, ఉపాధ్యక్షుడిగా పీ వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీశ్ బాబు, సంయుక్త కార్యదర్శిగాపీ విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా డీ గౌరు విష్ణు తేజ్ నామినేషన్లు దాఖలు చేశారు. మరెవరూ నామినేషన్లు వేయకపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.వచ్చే నెల 8న ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు.