అత్తాపూర్ మూసీ పరీవాహక ప్రాంతంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చేసేది పేదల కోసం కాదు.. డబ్బు సంచుల కోసం, బ్లాక్ మెయిలింగ్ కోసమని ఆరోపించారు. తాము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే.. నడమంత్రపు సిరితో ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడవద్దని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఖబర్ధార్.. మూసీలో దుర్గంధం క్లీన్ చెయ్యి కానీ, మా భూములు లాక్కొని పెద్దలకు ఇస్తా అంటే పేదలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. మా బొండల గడ్డ చూస్తామంటే మీ బొందలగడ్డ చూస్తాం అని ప్రజలు అంటున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రేపు మూసీ బాధితుల కోసం ఇందిరా పార్కు దగ్గర బీజేపీ ధర్నా నిర్వహించ తలపెట్టింది. తాము వారికి అండగా ఉంటామని ఈటల రాజేందర్ తెలిపారు.
Cyclone Dana: తుపాను రాకముందే పూర్తి సమాచారాన్ని అందజేసిన ఉపగ్రహాలివే..
మూసీ, చెరువల పక్కన ఉన్నవాళ్లకు నాలుగు నెలలుగా కంటిమీద కునుకులేకుండా పోయిందని ఈటల రాజేందర్ తెలిపారు. పొట్టచేత పట్టుకొని హైదరాబాద్‌కు వచ్చి ఒక తరం త్యాగం చేసి పైసా పైసా కూడబెట్టుకుంటే 50 గజాల జాగా కొనుక్కున్నారు.. చనిపోతే అనాథ శవంలా పోవద్దు అని ఇళ్ళు కట్టుకుంటే.. ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి ఇళ్ళు కూలగొడుతున్నారని తెలిపారు. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.. చెరువుల పక్కన, మూసీ పక్కన ఉన్నవి అన్నీ ప్రభుత్వ భూములు కావు, పట్టా భూములు కూడా ఉన్నాయి.. అందులో బ్యాంక్ రుణాలు తీసికొని కట్టుకున్న ఇళ్ళు కూడా ఉన్నాయని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
Navya haridas: వయనాడ్ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడం ఆశ్చర్యపోయాను
అనంతరం.. ఈటల రాజేందర్‌తో స్థానికులు తమ సమస్యలు చెప్పుకున్నారు. 1985 నుండి తమ భూములకు పక్కా కాగితాలు, రికార్డ్స్ ఉన్నాయన్నారు. పట్టా భూములు కొనుక్కున్నాం.. ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు అక్రమం అంటే తప్పు ఎవరిది? అని ఎంపీకి చెప్పారు. అప్పు చేసి కట్టుకున్నాం, ఇప్పుడు అప్పులు తీరాయి అనుకుంటే రేవంత్ రెడ్డి వచ్చి ఇళ్ళు గుంజుకుంటున్నాడని వాపోయారు. తమ అందరినీ పంపించి షాపింగ్ మాల్స్ కడతా అంటే ఎవరికోసం.. బ్యూటిఫికేషన్ ఎవరి కోసం.. ఇది న్యాయమా? అని అన్నారు. దోమలు, వాసన ఉందని తామే వెళ్ళిపోతామని చెప్పడం పచ్చి అబద్ధం అని స్థానికులు ఎంపీ ఈటల రాజేందర్ కు తెలిపారు. ప్రభుత్వ పెద్దలు ఊసరవెల్లిలా రోజుకో మాట మాట్లాడుతున్నారు.. రేవంత్ రెడ్డి ఇక్కడికి రావాలి.. అసలు ఇప్పటివరకు ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కానీ, అధికారి కానీ మాట్లాడలేదు.. మీరు వచ్చారు కానీ ఏ ఒక్కరూ రాలేదని స్థానికులు చెప్పారు.