Site icon NTV Telugu

Daggubati Purandeswari: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను గౌరవించింది బీజేపీ మాత్రమే!

Daggubati Purandeswari

Daggubati Purandeswari

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను గౌరవించింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చి పార్లమెంట్‌లో ఆయన చిత్రపటం పెట్టాం అని, 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. 106 సార్లు సవరణ జరిగిన రాజ్యాంగంలో అధిక శాతం కాంగ్రెస్ స్వలాభం కోసం సవరణలు జరిగాయని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ కాలంలో జరిగిన 22 సవరణలు సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకుని చేసినవే అని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణపై రాష్ట్రస్ధాయి కార్యాచరణ సమావేశానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరయ్యారు.

ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ సమసమాజ స్ధాపనకు కృషి చేశారు. 2014 ఎన్నికల్లో విపక్షాలు మా పట్ల దుష్ప్రచారం చేశాయి. అంబేడ్కర్‌ను గౌరవించింది బీజేపీ మాత్రమే. అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చి పార్లమెంట్‌లో ఆయన చిత్రపటం పెట్టాం. 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదు. 106 సార్లు సవరణ జరిగిన రాజ్యాంగంలో అధిక శాతం కాంగ్రెస్ స్వలాభం కోసం సవరణలు జరిగాయి. నరేంద్ర మోడీ కాలంలో జరిగిన 22 సవరణలు సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకుని చేసినవే. డీకే శివకుమార్ ముస్లిం మైనారిటీలకు 4% అదనపు రిజర్వేషన్ ఇవ్వడానికి రాజ్యాంగాన్ని మార్చేస్తాం అన్నారు. శివకుమార్‌కు రాజ్యాంగం పట్ల ఉన్న గౌరవం ఇదేనా.. మీకోసం మార్చేస్తారా?’ అని మండిపడ్డారు.

‘అంబేద్కర్ జయంతి వేడుకలు రేపటి నుంచి 25వ తేదీ వరకూ జరపాలని నిర్ణయం తీసుకున్నాం. అంబేద్కర్ ఆశయాలను గ్రామగ్రామాలకూ తీసుకెళ్ళాలని నిర్ణయించారు. బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారనే కాంగ్రెస్ దుష్ప్రచారం వల్ల వచ్చిన అనుమానాలు లేకుండా చేయడానికే ఈ వేడుకలు. అంబేద్కర్‌ను ఓడించాలని నెహ్రూ అప్పట్లో ఆదేశించారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ రాజ్యాంగానికి తూట్లు పొడిచింది. మోడీ దేశ అభువృద్ధి కోసం రాజ్యాంగ సవరణలు చేశారు. పార్టీ అధికారం కోసం ఏనాడూ బీజేపీ రాజ్యాంగ సవరణలు చేయలేదు. మోడీ నాయకత్వంలో దేశ అభివృద్ధి ధ్యేయంగా అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళుతున్నది బీజేపీ. ఎన్డీఏ ప్రభుత్వ కృషిని గురించి ప్రజలకు తెలిసేలా చేయడం, అంబేద్కర్ స్ఫూర్తి తెలిపేలా చేయడం మా ధ్యేయం’ అని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు.

Exit mobile version