Motorcycle Diaries: రిషబ్ శెట్టి సమర్పించు ‘మోటార్ సైకిల్ డైరీస్’..!

Motorcycle Diaries

Motorcycle Diaries

Motorcycle Diaries: టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, రిషబ్ శెట్టి ఫిల్మ్స్ సంయుక్తంగా ఓ వినూత్న సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ప్రతి మైలురాయి ఓ జ్ఞాపకంగా.. ప్రతి మలుపు ఓ కథగా సాగే ఓ భావోద్వేగ ప్రయాణమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. కేవలం గమ్యస్థానాలకు చేరుకోవడం మాత్రమే కాకుండా.. ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు, కొత్త పరిచయాలు, జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలకు ఈ సినిమాలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఓ అందమైన ట్రావెల్ ఫిల్మ్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.

ఈ సినిమాకు శివా చిరంతన దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, ప్రగతి రిషబ్ శెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. భువన్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, ధరణి గంగెపుత్ర ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

విభిన్నమైన కథలతో సినిమాలు నిర్మించే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, రిషబ్ శెట్టి ఫిల్మ్స్ కలిసి చేస్తున్న ఈ ప్రయత్నంపై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రిషబ్ శెట్టి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో నటించే నటీనటులు, ఇతర వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. డిఫరెంట్ టైటిల్‌తో రాబోతున్న ఈ ‘మోటార్‌సైకిల్ డైరీస్’ ప్రేక్షకులను ఎలాంటి భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్తుందో చూడాలి.