NTV Telugu Site icon

Driver Saved Lives: గుండెపోటు వచ్చినా కేర్‌ చేయలే.. 60 మందికి పైగా ప్రాణాలు కాపాడిన డ్రైవర్

Driver Saved Lives

Driver Saved Lives

Driver Saved Lives: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మంగళవారం నాడు 60 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు ఓ బస్సు డ్రైవర్‌. ఆ వ్యక్తి బస్సును నడుపుతున్నప్పుడు అతనికి గుండెపోటు రాగా.. ఆ నొప్పితో కూడా బస్సును ఆపి బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. కానీ బస్సును ఆపిన అనంతరమే అతని గుండె ఆగిపోయింది. ఆ బస్సులోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ డ్రైవర్‌ బస్సును ఆపి ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఒడిశాలోని బాలాసోర్ జిల్లా పటాపూర్ చక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Read Also: Metro Train: మెట్రో ట్రైన్ లో పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రయాణికులు

పశ్చిమ బెంగాల్ నుంటి పర్యాటకులతో బస్సు జిల్లాలోని పంచలింగేశ్వరాలయం వైపు వెళుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చిందని పోలీసులు తెలిపారు. నొప్పిగా అనిపించిన వెంటనే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి స్పృహ కోల్పోయాడు. భయాందోళనకు గురైన ప్రయాణికులు స్థానికులను పిలిచారు, వారు డ్రైవర్‌ను షేక్ అక్తర్‌గా గుర్తించి సమీపంలోని నీలగిరి సబ్‌డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.

డ్రైవర్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై బస్సును నిలిపివేసినట్లు ప్రయాణీకుల్లో ఒకరైన అమిత్ దాస్ తెలిపారు. రోడ్డుకు ఒకవైపు వాహనం ఆగిన వెంటనే స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్‌ మనోగతాన్ని ప్రయాణికులు, స్థానికులు కొనియాడారు. ప్రయాణికుల ప్రాణాలను రక్షించిన ఆయనను దేవుడిలా కొనియాడుతున్నారు.