Moinabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా గడపాల్సిన సమయం విద్యార్థుల జీవితాల్లో కోలుకోలేని విషాదాన్ని నింపింది. స్థానిక కేజీరెడ్డి కాలేజీలో నిర్వహించిన ఫెస్ట్ అనంతరం పదిమంది విద్యార్థులు కలిసి సమీపంలోని పొలాల్లోకి వెళ్లారు. అక్కడ మద్యం సేవిస్తున్న సమయంలో హఠాత్తుగా పోలీసు పెట్రోలింగ్ వాహనం రావడాన్ని గమనించి, భయాందోళనతో విద్యార్థులు పరుగులు తీశారు. ఈ క్రమంలో రైతు రాజిరెడ్డి అనే రైతు తన పంటను అడవి పందుల బారి నుంచి రక్షించుకోవడానికి పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలను విద్యార్థులు గమనించలేకపోయారు. చీకట్లో పరుగెడుతూ ఆ విద్యుత్ తీగలకు తగలడంతో యశ్వంత్, మోక్షా చరణ్ అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తారనుకున్న కొడుకులు అనంత లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Moinabad: కాలేజీ ఫెస్ట్ తర్వాత ఘోరం.. పొలంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి

Drdo Employee Dies
