Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!

Mohammed Siraj

Mohammed Siraj

Mohammed Siraj: ఒకప్పుడు చుట్టూ పేదరికం, నాన్న తోలే ఆటో నుంచి వచ్చే అరాకొరా సంపాదనతోనే ఆ కుటుంబం బతికేది. పూట గడవడమే గగనమైన ఆ పరిస్థితులలో క్రికెట్ బ్యాట్, స్పైక్ షూస్ కొనడం సాధ్యమయ్యేది కాదు. కానీ, ఆ భావి భారత స్టార్ బౌలర్ కళ్లలోని కలలకు పేదరికం హద్దులు గీయలేకపోయింది. ఇంతకీ ఎవరా బౌలర్ అనుకుంటున్నారా? అతడే నండి.. మన హైదరాబాద్ బస్తీల నుంచి ప్రపంచ క్రికెట్ శిఖరాలకు చేరిన మహమ్మద్ సిరాజ్. అతని జీవిత ప్రయాణం కేవలం ఒక క్రీడాకారుడి విజయం మాత్రమే కాదు, అంతులేని ఆత్మవిశ్వాసానికి, కష్టపడే తత్వానికి నిలువెత్తు నిదర్శనం.

హైదరాబాద్‌లోని ఒక చిన్న అద్దె ఇంట్లో పుట్టి పెరిగిన సిరాజ్.. చిన్నతనం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నడుమ సాగింది. తండ్రి మహమ్మద్ గౌస్ ఆటో డ్రైవర్‌గా కష్టపడి కుటుంబాన్ని పోషిస్తే, తల్లి ఇళ్లల్లో వంటలు, పనులు చేస్తూ ఆసరాగా నిలిచింది. 19 ఏళ్ల వయసొచ్చినా సిరాజ్‌కు కనీసం సరైన బూట్లు కూడా ఉండేవి కావు. కాళ్లకు చప్పుళ్లు లేదా మామూలు కాన్వాస్ షూస్ వేసుకునే బౌలింగ్ చేసేవాడు. కుటుంబానికి తోడుగా ఉండేందుకు, తన క్రికెట్ ఖర్చుల కోసం కేటరింగ్ పనులు కూడా చేశాడు. ఆ సమయంలోనే ఒక లోకల్ క్రికెట్ క్లబ్ కంటపడటంతో అతనికి తొలిసారిగా సరైన క్రికెట్ కిట్, స్పైక్ బూట్లు లభించాయి. టెన్నిస్ బాల్ క్రికెట్‌తో బౌలింగ్ మెళకువలు, యార్కర్లు వేసే నైపుణ్యాన్ని పెంచుకున్న సిరాజ్, ఆ తర్వాత లెదర్ బాల్‌తో తన ప్రయాణాన్ని వేగవంతం చేశాడు. హైదరాబాద్ రంజీ జట్టులోకి వచ్చి, ఒకే సీజన్‌లో 40కి పైగా వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆపై ఐపీఎల్, ఇండియా ‘ఎ’ జట్లలో రాణించి భారత జాతీయ జట్టు తలుపులు తట్టాడు. టెస్టులు, వన్డేలు, టీ20లలో టీమిండియాకు అత్యంత నమ్మకమైన బౌలర్‌గా మారాడు. ముఖ్యంగా 2020-21 నాటి చారిత్రాత్మక ఆస్ట్రేలియా పర్యటనలో సిరాజ్ ప్రదర్శన క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోతుంది. సిరీస్ జరుగుతుండగానే తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ, దేశం కోసం మైదానంలో దిగి భారత బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించి గాబా టెస్ట్ విజయానికి, సిరీస్ కైవసానికి కీలక పాత్ర పోషించాడు. వన్డేలలో పవర్ ప్లే వికెట్లు తీయాలన్నా, ఆఖరి ఓవర్లలో మ్యాచ్‌ను మలుపు తిప్పే యార్కర్లు వేయాలన్నా సిరాజ్ స్వింగ్, వేగమే భారత్‌కు అతిపెద్ద ఆయుధంగా మారాయి.

ఐపీఎల్‌లోనూ సిరాజ్ తన మార్కును స్పష్టంగా చూపించాడు. చాలా కాలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడి, ఐపీఎల్ 2025 వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు ద్వారా రూ. 12.25 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాడు. ఈ మైలురాయితో అతని బ్రాండ్ విలువ మరింత పెరిగింది. తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు సుమారు రూ. 40 కోట్లు సంపాదించగా, అతని ఆదాయానికి ఐపీఎల్ ప్రధాన వనరుగా నిలిచింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లోనూ సిరాజ్ హోదా వేగంగా పెరిగింది. గతంలో ప్రతి ఏటా రూ. 5 కోట్లు లభించే ‘గ్రేడ్ ఎ’లో ఉన్న సిరాజ్, ప్రస్తుతం ‘గ్రేడ్ బి’ కేటగిరీలో కొనసాగుతూ రూ. 3 కోట్ల వార్షిక రిటైనర్ ఫీజు పొందుతున్నాడు. ఇవి కాకుండా టెస్ట్ మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కి రూ. 3 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజుగా అందుతోంది. మైదానంలో అతడు చూపించే శక్తి, మైదానం బయట అతని నిరాడంబరత యువతను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ పాపులారిటీతో మై11సర్కిల్, థమ్స్ అప్, కాయిన్ స్విచ్ కుబేర్, ఎస్జీ క్రికెట్, నిప్పాన్ పెయింట్, మై ఫిట్‌నెస్ వంటి అగ్రగామి బ్రాండ్లకు అంబాసిడర్‌గా మారి ప్రకటనల ద్వారా ఏటా కోట్లు ఆర్జిస్తున్నాడు. ఒకప్పుడు అద్దె ఇంట్లో గడిపిన సిరాజ్ ఆస్తుల విలువ 2025 నాటికి రూ. 57 కోట్లకు పైగా చేరింది. తను సంపాదించిన డబ్బుతో హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో రూ. 13 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాను నిర్మించి, కుటుంబానికి రాజభోగాలను అందించాడు.

ఆటతో దేశానికి పేరు తేవడమే కాకుండా లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన సిరాజ్‌ను తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత రీతిలో గౌరవించింది. టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం, అక్టోబర్ 2024లో రాష్ట్ర ప్రభుత్వం అతనికి గౌరవ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) పదవిని కేటాయించింది. పోలీసు అధికారుల సమక్షంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించి, ఖాకీ దుస్తుల్లో డీజీపీ కార్యాలయంలో అధికారులను కలిసిన క్షణం అతని కుటుంబానికి మరుపురాని గౌరవంగా నిలిచింది. డిఎస్పీ హోదా ద్వారా అతనికి లభించే జీతం కూడా ఆదాయంలో భాగమైంది. చిరిగిన చెప్పులతో బౌలింగ్ ప్రారంభించి, ఒక ఆటో డ్రైవర్ కొడుకుగా ప్రయాణం మొదలుపెట్టి, నేడు కోట్లాది రూపాయల ఆస్తులకు అధిపతిగా, రాష్ట్రానికి కీలకమైన పోలీస్ అధికారిగా ఎదిగిన సిరాజ్ జీవితం ఒక అద్భుత ఘట్టం. పేదరికాన్ని గెలిచి, కష్టాలను తలదన్ని, కలలను నిజం చేసుకోవచ్చని నిరూపించిన మహమ్మద్ సిరాజ్ ప్రయాణం ప్రతీ ఒక్కరికీ ఎప్పటికీ మరుపురాని ప్రేరణ.