Mohammed Siraj: భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. రాబోయే రంజీ ట్రోఫీ సీజన్ కోసం హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా సిరాజ్‌ను నియమించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. సిరాజ్‌తో పాటు చామ మిలింద్‌ను జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య సెప్టెంబర్ 13 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌కు సిరాజ్ ఎంపిక కాలేదు. దీంతో రంజీ ట్రోఫీ కోసం హైదరాబాద్ జట్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. గత రంజీ సీజన్‌లోనూ సిరాజ్ హైదరాబాద్ జట్టుకు రెండు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు.
గత సీజన్‌లో రాహుల్ సింగ్ స్థానంలో సిరాజ్‌కు హైదరాబాద్ జట్టు పగ్గాలు అప్పగించారు. అయితే కెప్టెన్‌గా ఆయనకు తొలి విజయం మాత్రం దక్కలేదు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ముంబై 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత జింఖానా గ్రౌండ్‌లో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్ చివరి రోజు అమన్‌దీప్ ఖరే అజేయ సెంచరీ సాధించి తన జట్టును మ్యాచ్‌లో నిలబెట్టాడు. దీంతో హైదరాబాద్ విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు పూర్తిస్థాయి రంజీ సీజన్‌లో హైదరాబాద్ కెప్టెన్‌గా సిరాజ్‌కు మరోసారి తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం లభించింది.
రాబోయే రంజీ ట్రోఫీ సీజన్‌లో హైదరాబాద్‌ను ఎలైట్ గ్రూప్-Bలో చేర్చారు. ఈ గ్రూప్‌లో హైదరాబాద్‌తో పాటు సౌరాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అసోం, త్రిపుర జట్లు ఉన్నాయి. ఈ జట్లతో హైదరాబాద్ కీలక మ్యాచ్‌లు ఆడనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసిన ప్రకటనలో.. మహ్మద్ సిరాజ్ అందుబాటులో లేని సమయంలో చామ మిలింద్ జట్టు పగ్గాలు చేపడతారని తెలిపింది. సిరాజ్, మిలింద్‌కు రాబోయే రంజీ సీజన్ కోసం శుభాకాంక్షలు తెలిపిన HCA.. జట్టుకు తమ నాయకత్వంతో పాటు కీలక సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

