NTV Telugu Site icon

Mohammed Shami: ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఏం పొరపాటు చేశామో ఇప్పటికీ అర్థం కావడం లేదు!

Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami React on ODI World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో తాము ఏం పొరపాటు చేశామో ఇప్పటికీ అర్థం కావడం లేదని సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అన్నాడు. ఇప్పటికీ ఫైనల్‌ షాక్‌ నుంచి తేరుకోలేదన్నాడు. భారత జట్టు కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని షమీ ఆవేదన వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి.. తుది మెట్టుపై బోల్తా పడడంతో భారత్ ఫాన్స్ సహా ఆటగాళ్లు ఏడ్చేశారు.

తాజాగా మహమ్మద్ షమీ ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘భారత దేశమంతా ఓటమితో తీవ్ర నిరుత్సాహానికి గురైంది. అభిమానులు మాపై ఎన్నో అంచనాలు పెంచుకున్నారు. మేం కూడా కప్‌ను సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. వందశాతం శ్రమించి.. ఫైనల్‌కు చేరాం. విశ్వ విజేతగా నిలవాలని కలలుగన్నాం. కానీ మా అంచనాలు తారుమారయ్యాయి. జట్టు కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఫైనల్‌లో ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికీ ఫైనల్ షాక్‌ నుంచి తేరుకోలేదు’ అని బుధవారం ఆజ్ తక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ చెప్పాడు. చీలమండ గాయం కారణంగా షమీ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.

Also Read: IND vs SA: భారత జట్టు నిజంగా అతన్ని మిస్సవుతోంది.. అద్భుతాలు చేసేవాడు!

‘ఫైనల్‌లో ఓటమి తర్వాత అందరూ మైదానం నుంచి నేరుగా డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాం. ఎవరం మాట్లాడుకోలేదు. డ్రెస్సింగ్‌ రూమ్‌ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. రెండు నెలల పాటు చేసిన శ్రమ వృధా కావడంతో నిరుత్సాహం చెందాం. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చారు. ఎవరా అని అందరం తలెత్తి చూశాం. ప్రధానిని చూసి షాక్ అయ్యాము. ఎందుకంటే.. ప్రధాని వస్తున్నారనే సమాచారం మాకు లేదు. ఆయన ప్రతి ఒక్కరి దగ్గరకూ వచ్చి ధైర్యం చెప్పారు. ఆ తర్వాతనే మేమంతా ఒకరితో మరొకరు మాట్లాడుకున్నాం’ అని మహమ్మద్ షమీ తెలిపాడు. ప్రపంచకప్‌ 2023లో షమీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. కేవలం 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత ఉంది.