Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..

Modi Trump

Modi Trump

Modi-Trump Meeting: ఫ్రాన్స్‌లో జరగబోయే జీ7 సదస్సు వేదికగా భారత్, అమెరికా దేశాల మధ్య ఒక కీలక ఘట్టానికి తెరలేవనుంది. జూన్ 17న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:15 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ విషయాన్ని శనివారం వైట్‌హౌస్ అధికారికంగా ధృవీకరించింది. ఫిబ్రవరి 2025లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన తర్వాత, డోనాల్డ్ ట్రంప్‌తో ఆయన ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని (ట్రేడ్ డీల్) త్వరితగతిన ఖరారు చేయడమే ఈ సమావేశం ముఖ్య ఎజెండాగా ఉండబోతోంది.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు జూన్ 16, 17 తేదీల్లో ప్రధాని మోడీ ఈ జీ7 సదస్సులో పాల్గొంటారు. ఈ పర్యటనలో జీ7 దేశాల అధినేతలతో పాటు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ప్రపంచ భాగస్వామ్యం, సుస్థిర ఆర్థిక వృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సురక్షిత వినియోగం వంటి కీలక అంశాలపై చర్చిస్తారు. గత ఏడాది కాలంగా భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్‌పై లోతైన చర్చలు జరుగుతున్నాయని, ఈ ఏడాది ప్రారంభంలోనే ఇరు దేశాలు వాణిజ్య ఒప్పంద సంయుక్త ఫ్రేమ్‌వర్క్‌పై సంతకాలు సైతం చేశాయని వైట్‌హౌస్ సీనియర్ అధికారి తెలిపారు. ఇంధనం, పారిశ్రామిక ఉత్పత్తులు, కొన్ని రకాల వ్యవసాయ వస్తువుల రంగాల్లో ద్వైపాక్షిక వ్యాపారాన్ని పెంచేందుకు ఇరు దేశాలకు భారీ అవకాశాలు ఉన్నాయని, ఈ విషయంలో ప్రధాని మోడీ ఎంతో ప్రతిష్టాత్మకమైన దృక్పథంతో ఉన్నారని అమెరికా పేర్కొంది. జీ7 సదస్సు ముగిసిన అనంతరం జూన్ 18న ప్రధాని మోడీ పారిస్ నగరానికి చేరుకుంటారు. అక్కడ అదనపు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొనడంతో పాటు, యూరప్‌లోనే అతిపెద్ద టెక్నాలజీ, స్టార్టప్ ఈవెంట్ అయిన ‘వివాటెక్ సమ్మిట్’ (VivaTech Summit) కు హాజరవుతారు. అలాగే ఫ్రాన్స్‌లో స్థిరపడిన భారతీయ సమాజ ఉద్దేశించి ప్రసంగిస్తారు.

×
×
Ad

మరోవైపు, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో జరుగుతున్న ఈ ఇరు నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒమన్ తీరంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడుల కారణంగా ఇటీవల ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. జూన్ 8న పలావు జెండాతో వెళ్తున్న ‘మారివెక్స్’ ట్యాంకర్‌పై అమెరికా జరిపిన దాడి నుంచి 24 మంది భారతీయ నావికులు సురక్షితంగా బయటపడ్డారు. కానీ, ఆ తర్వాత రెండు రోజులకు ‘ఎంటీ సెటెబెల్లో’ అనే మరో ట్యాంకర్‌పై జరిగిన అమెరికా దాడిలో ముగ్గురు భారతీయ నావికులు (డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్) ప్రాణాలు కోల్పోయారు. అలాగే జూన్ 11న 20 మంది భారతీయులు ఉన్న ‘జలవీర్’ ట్యాంకర్‌పై కూడా దాడి జరిగింది. ఈ వరుస ఘటనలపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని అమెరికా ఇన్‌ఛార్జ్ రాయబారిని పిలిపించి కేంద్ర విదేశాంగ శాఖ ఘాటుగా నిరసన తెలియజేసింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీసేలా ఇలాంటి ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతి స్థాపనకు దౌత్యపరమైన చర్చలే మార్గమని స్పష్టం చేసింది. అయితే, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ దాడులను సమర్థించుకుంటూ.. హోర్ముజ్ జలసంధిలో తమ నౌకాదళ దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తే సహించేది లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో జరిపిన సంభాషణలో స్పష్టం చేశారు. ఈ సున్నితమైన పరిస్థితుల నేపథ్యంలో మోడీ-ట్రంప్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.