Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు టీడీపీలో చేరారు. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని అనుకున్నామని, కానీ, మండలి చైర్మన్ తమ రాజీనామాలను ఆమోదించకుండా పక్కన పెట్టారని మర్రి రాజశేఖర్ ఆరోపించారు. దాని వెనుక ఆయనకు ప్రత్యేక అజెండా ఉందని చెప్పారు. టీడీపీలో చేరడం సొంతగూటికి వచ్చినట్లు ఉందన్నారు కల్యాణ్ చక్రవర్తి. తన తండ్రి పూర్తికాలం టీడీపీతోనే ఉన్నారని తెలిపారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఏడాది అవుతోందని కానీ, ఇంతవరకు ఆమోదించలేదని పద్మశ్రీ చెప్పారు. పదవి ఉన్నా ప్రజలకు పెద్దగా ఏమీ చేయలేకపోయామన్నారు.
Read Also: HYDRA Long Live : కౌకూరులో వరద ముప్పు తప్పించిన హైడ్రా
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. జయమంగళ వెంకటరమణ, జకియా ఖానమ్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్‌లు వైసీపీని వీడారు. వీరంతా మండలి చైర్మన్ మోషేన్ రాజుకు తమ రాజీనామా లేఖలు సమర్పించారు. వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి కూడా చేశారు. మర్రి రాజశేఖర్ రాజీనామా సమర్పించి ఆరు నెలలు గడిచింది. కర్రి పద్మశ్రీ రాజీనామా చేసి ఏడాది దాటింది. కళ్యాణ్ చక్రవర్తి రాజీనామా ఇచ్చి 13 నెలలు దాటింది. ఇంకా మండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజీనామాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. జయమంగల వెంకటరమణ అయితే తన రాజీనామాను ఆమోదించేలా మండలి చైర్మన్‌ను ఆదేశించాలంటూ హైకోర్టుకు కూడా వెళ్లారు. హైకోర్టు కూడా మండలి చైర్మన్‌ను వివరణ కోరింది.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సెషన్‌లో అయినా తమ రాజీనామాలు ఆమోదం పొందుతాయో లేదో అనే అనుమానం ఎమ్మెల్సీల్లో కలిగినట్టు ఉంది. జయమంగల వెంకటరమణ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం మండలి చైర్మన్ మోషేన్ రాజు నిర్ణయం తీసుకోవాల్సిందే. దాంతోపాటు మిగతావారి రాజీనామాలు ఆమోదించాలి. ఇప్పుడప్పుడే రాజీనామాలను ఆమోదించే పరిస్థితి లేదు. మరి కొంతకాలం సమయం పట్టేలా ఉంది. ఇవన్నీ గమనించి ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీ కండువా కప్పుకున్నారు. వెంటనే కర్రీ పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి టీడీపీలో చేరారు. మే నెలలోనే జకియా ఖానం బీజేపీలో చేరగా… పోతుల సునీత ఈ మధ్యే బీజేపీలో చేరారు. వైసీపీని వీడిన ఎమ్మెల్సీలంతా తమ రాజీనామాలు ఇకనైనా ఆమోదం పొందుతాయో..? లేదో..? అనే డైలమాలో ఉన్నారు. టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు సోమవారం మండలికి రానున్నారు.
ఓవైపు రాజీనామాలు ఆమోదం పొందక, మరోవైపు మండలికి రాలేక ఇబ్బంది పడుతున్నారు ఎమ్మెల్సీలు. దాంతో ఒక నిర్ణయం తీసుకుని టీడీపీలో చేరారు. టీడీపీకి కౌన్సిల్‌లో సరైన మెజారిటీ లేకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. వీరి చేరికతో టీడీపీ బలం కొంత పెరిగింది. అయితే ఎమ్మెల్సీలు పార్టీ మారితే అనర్హత వేటు పడే అవకాశం కూడా ఉంది. వైసీపీ ఫిర్యాదు చేస్తే అనర్హత వేటుపై నిర్ణయం తీసుకుంటారు. అనర్హత వేటు విషయం వస్తే తాము ఆల్రెడీ రాజీనామాలు చేశామనే చెప్పుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా టీడీపీలోకి వస్తారనే చర్చ జరుగుతోంది.
